- లాక్డౌన్-4(మే 31) ముగిసే నాటికి బెంగళూరు నగరంలో కరోనా కేసులు 359.
- అన్‌లాక్ 1.0(జూన్ 30) సమాప్తమయ్యేసరికి కేసుల సంఖ్య 4,555.
- బుధవారం(జులై 8) నాటికి 12,509 కేసులు.
లాక్డౌన్ సడలించిన తర్వాత బెంగళూరు నగరంలో కరోనా విలయతాండవం చేస్తోందనడానికి ఈ గణాంకాలే సాక్ష్యం. బెంగళూరుతో పాటు దక్షిణాదిలో మరో ప్రధాన నగరమైన హైదరాబాద్‌లోనూ కరోనా విజృంభిస్తోంది. గత నెల రోజులుగా బాధితుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతూ వస్తోంది.
ఈ నెల తొలి వారంలోనే బెంగళూరులో 6,800 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో ఏకంగా 9 వేల కేసులు రికార్డయ్యాయి. ఆంక్షలు సడలించాక ప్రజలు బయట తిరగడమే కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమన్నది అధికారుల మాట.
అంచనాలను మించి!
దక్షిణాదిలో మరో ప్రధాన నగరమైన చెన్నైలో మాత్రం మొదటి నుంచి కేసులు భారీగానే నమోదవుతున్నాయి. నెల రోజుల క్రితమే తమిళనాడు కరోనాతో కుదేలైనప్పటికీ.. ఈ రెండు నగరాలు మాత్రం వైరస్‌కు చాలా దూరంగా ఉన్నాయి.
కానీ బెంగళూరులో అంచనా వేసినదాని కంటే వేగంగా కరోనా ప్రబలుతోంది. రెండు వారాల క్రితం వరకు సాధారణంగానే ఉన్న మహమ్మారి.. దేశ ఐటీ రాజధానిపై ఒక్కసారిగా కోరలు చాచింది. గత నెల చివర్లో నుంచి టెస్టుల సంఖ్య పెంచడం వల్ల హైదరాబాద్‌లోనూ కేసుల పెరుగుదల నమోదైంది. హైదరాబాద్ మహానగర పరిధిలో 50 వేల పరీక్షలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
బెంగళూరులో...
మే 31న లాక్డౌన్-4 ముగిసే నాటికి బెంగళూరులో 359 కరోనా కేసులు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాతి నుంచి నగరంలో మహమ్మారి విలయం సృష్టించింది. జూన్ 30న అన్‌లాక్ 1.0 ముగిసే నాటికి కేసుల సంఖ్య 4,555కి పెరిగింది. బుధవారం నాటికి ఈ సంఖ్య 12,509కి ఎగబాకింది. అధికారిక గణాంకాల ప్రకారం నగరంలో ప్రస్తుతం 10,103 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- 177 మంది బాధితులు మృతి.
- 2,228 మంది డిశ్చార్జ్.
- పాజిటివిటీ రేటు 8.52 శాతం
- మరణాల రేటు 1.37 శాతం
"బెంగళూరు నగరంలో కేసులు పెరుగుతాయని అందరూ అంచనా వేశారు. కానీ కేసులు పెరిగిన సమయమే అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఈ వారం చివరి నాటికి కొవిడ్ కేర్ సెంటర్లు సహా అన్ని ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, బెంగళూరు మహానగర పాలిక ప్రణాళికలు వేసుకున్నాయి. అయితే రెండు వారాల క్రితమే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం ప్రారంభమైంది. ప్రారంభంలో అత్యవసర చర్యలు చేపట్టడం సాధ్యం కాకపోయినా... ఇప్పుడు వ్యవస్థ క్రమంగా గాడినపడుతోంది. "
-డా. గిరిధర్ బాబు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, కర్ణాటక కొవిడ్-19 సాంకేతిక సలహా కమిటీ సభ్యుడు
ఆంక్షలు సడలిస్తే కేసుల పెరుగుతాయని రాష్ట్ర యంత్రాంగం సైతం అంచనా వేసిందని.. అయితే ఇంత త్వరగా తీవ్రత పెరుగుతుందని అనుకోలేదని చెప్పారు గిరిధర్. కర్ణాటక వైద్యవిద్యా శాఖ మంత్రి సుధాకర్ సైతం ఇదే విషయం స్పష్టం చేశారు. నగరంలో ప్రస్తుతం చూస్తున్న కేసులు జులై చివరి నాటికి వస్తాయని ఊహించామని పేర్కొన్నారు. అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
కర్ణాటకలో నమోదైన మొత్తం 28,877 కేసుల్లో... 12,509 బెంగళూరు అర్బన్ నుంచే నమోదయ్యాయి. బుధవారం పాజిటివ్‌గా తేలిన 2,062 మందిలో 1,148 మంది బాధితులు బెంగళూరుకు చెందినవారే.
అన్‌లాక్‌తో తారుమారు
ఆరంభంలో బెంగళూరులో కరోనా అదుపులో ఉండడానికి ప్రధాన కారణం... కాంటాక్ట్ ట్రేసింగ్. అప్పట్లో ప్రతి కేసుకు సంబంధించి విస్తృతంగా కాంటాక్ట్ ట్రేసింగ్ చేసేవారు అధికారులు. కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి ఎవరెవరిని కలిశారో గుర్తించి, వెంటనే ఐసోలేషన్లోకి పంపేవారు. కానీ... లాక్డౌన్ ఎత్తివేత తర్వాత ఆ పరిస్థితి లేదు. అధికారులు, సిబ్బంది అంతా తమ రోజువారీ విధుల్లో నిమగ్నమైపోయారు. కాంటాక్ట్ ట్రేసింగ్ చేసేందుకు మానవ వనరుల కొరత ఏర్పడింది.
ఈ విషయాన్ని ఉన్నతాధికారులు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బెంగళూరులో పక్కాగా కాంటాక్ట్ ట్రేసింగ్ చేసేందుకు వేర్వేరు విభాగాలకు చెందిన 1,246 మంది ఉద్యోగుల్ని కేటాయించారు.
హైదరాబాద్‌లో ఇలా...
హైదరాబాద్‌లోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. జులై 1 నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మే 31 నాటికి తెలంగాణలో 2,698 కేసులు ఉండగా... ప్రస్తుతం ఈ సంఖ్య 29,536కి ఎగబాకింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 23,223 కేసులు నమోదయ్యాయి. ఈ నెల తొలి వారంలో రాష్ట్రంలో ఏకంగా 9,227 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
- జూన్ నెలలో 13,741 కేసులు- సగటున రోజుకు 454 మందికి పాజిటివ్
- జులై 1-8 మధ్య రాష్ట్రంలో 13,197 కేసులు నమోదు
- జులైలో సగటున రోజుకు 1650 కేసులు
- బుధవారం నాటికి యాక్టివ్ కేసులు 11,939
- కోలుకున్నవారి సంఖ్య 17,279
వైఫల్యం ఎవరిది?
రాష్ట్రంలో కరోనా నియంత్రణ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టెస్టుల నిర్వహణ విషయమై ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు.
మరోవైపు ప్రభుత్వం విడుదల చేస్తున్న కరోనా నివేదికలపై రాష్ట్ర హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజల కోసం విడుదల చేస్తున్న కరోనా నివేదికల్లో వివరణాత్మక సమాచారం ఎందుకు లేదని ప్రశ్నించింది. టెస్టుల నిర్వహణపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది.
బుధవారం నాటికి తెలంగాణలో 29,536 కేసులు నమోదు కాగా... 324 మంది మరణించారు. మొత్తం 1,34,801 కరోనా పరీక్షలు నిర్వహించారు. లాక్డౌన్ తర్వాత ప్రజలు బయట తిరగడం వల్లే కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. చాలా మంది ప్రజలు నిబంధనలు పాటించడం లేదని పేర్కొన్నారు. ఎక్కువ మంది మాస్కులు ధరించడం లేదని చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి- తెలంగాణలో కొత్తగా 1924 మందికి కరోనా పాజిటివ్