ప్రాంతీయ అనుసంధాన పథకం కింద జాతీయ విమానాశ్రయాల సంస్థ దేశంలో 22 విమానాశ్రయాల్ని ఎంపిక చేయగా, అందులో దక్షిణ భారత రాష్ట్రాలకు ఒక్కటీ ఇవ్వలేదు. కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్‌లో మాత్రం ఒకటుంది. అసోంలో మూడు, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్‌ల నుంచి రెండేసి చొప్పున ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం చిన్నచూపు చూస్తోందనడానికి ఇది ఒక నిదర్శనం. ‘అసమానతలు తొలగితేనే అభివృద్ధి అన్ని ప్రాంతాలకు చేరుతుంది. పరిపాలన, అభివృద్ధిపరంగా దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒకే రకంగా చూడాల్సిన అవసరం ఉంది’ అని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 2007లో గణతంత్ర వేడుకల సందర్భంగా వ్యాఖ్యానించారు. ఏడు దశాబ్దాల గణతంత్ర భారతంలో ప్రాంతీయ అసమానతలు ఇంకా కొనసాగడం విచారకరం. సామాజికంగానే కాకుండా, పాలనపరంగా దేశంలో ఇలాంటి ధోరణి కొనసాగుతోందనేది కాదనలేని సత్యం.
పనితీరులో ముందంజ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి వంటి కేంద్ర పాలిత భూభాగాలతో కలిపి- దక్షిణ భారతదేశం. దేశ విస్తీర్ణంలో 19.31% (2,45,480 చదరపు మైళ్లు) కలిగిఉంది. దక్కన్ పీఠభూమి దక్షిణభాగంలోని ఈ ప్రాంతానికి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. పశ్చిమ, తూర్పు కనుమలు మరోవైపున్నాయి. గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర తదితర నదులు శాశ్వత నీటి వనరులు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోయంబత్తూర్, కొచ్చి, విశాఖపట్నం, తిరువనంతపురం, మైసూరు, విజయవాడ, మదురై, మంగళూరు, తిరుచిరాపల్లి వంటివి కొన్ని ప్రధాన నగరాలు. దక్షిణ భారతదేశ జనాభాలో 48శాతానికి పైగా వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. ఇక్కడి సాగు ఎక్కువగా కాలానుగుణ రుతుపవనాలపై ఆధారపడి ఉంటోంది. దక్షిణ భారతదేశంలో పండించే ప్రధాన పంటల్లో వరి, జొన్న, పప్పు ధాన్యాలు, చెరకు, పత్తి, మిర్చి, పసుపు కీలకం. దేశంలో మొత్తం కాఫీ ఉత్పత్తిలో 92శాతం వాటా దక్షిణాదిదే. కూరగాయలు, పాలు, పండ్లు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో దక్షిణ భారతం అగ్రస్థానంలో ఉంది. పట్టు, కోళ్ల పెంపకంలో ముందంజ వేస్తోంది. దేశంలోని ప్రధాన ఐటీ కేంద్రాలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్ వంటివి దక్షిణాది నగరాల్లోనే ఉన్నాయి. ఆటొమొబైల్ ఉత్పత్తిలో 35శాతం మేర వాటా కలిగిఉంది. మోటార్లు, పంపుల్లో మూడో వంతు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. వస్త్ర పరిశ్రమ, ఆభరణాల వ్యాపారంలోనూ దక్షిణాది రాష్ట్రాలు ప్రముఖ స్థానంలో ఉన్నాయి. దేశంలోని దాదాపు 60శాతందాకా జౌళి మిల్లులు ఈ ప్రాంతంలోనివే. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ పర్యాటకుల రాకపోకల్లో మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు- దక్షిణాదిలో విద్యాసంస్థల పనితీరు మెరుగ్గా ఉంటోంది. నీతిఆయోగ్ తాజా నివేదిక ప్రకారం నూతన ఆవిష్కరణల్లో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ దేశంలో మొదటి అయిదు రాష్ట్రాల్లో చోటు దక్కించుకున్నాయి. సులభతర వాణిజ్య నిర్వహణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచాయి.
పన్నుల రూపేణా సమకూరే ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాలదే పైచేయి. ఈ పద్దుకింద అవి కేంద్రానికి ఇతర రాష్ట్రాలకంటే ఎక్కువ నిధులు అందజేస్తున్నాయి. అదే వాటా ప్రకారం కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉన్నా ఆచరణకు నోచుకోవడం లేదు. ప్రతి రాష్ట్ర పన్నుల వాటాకు జనాభా, ఆదాయం, విస్తీర్ణం, అటవీ విస్తీర్ణం తదితర ప్రమాణాలను ఆర్థిక సంఘం గతంలో నిర్దేశించింది. ఇందులో లోపాలున్నా సవరించే దిశగా ఇప్పటికీ కృషి జరగడం లేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ స్వయం నిర్ణయాధికారాలు కొన్ని రాష్ట్రాలకే మేలు చేస్తున్నాయి. పన్నుల రూపంలో తమిళనాడు కేంద్రానికి చెల్లించే ఆదాయంలో దానికి వచ్చే వాటా ప్రతీ రూపాయికి 30 పైసలే. కర్ణాటకతోపాటు, రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితీ ఇంతకన్నా గొప్పగా లేదు. మరోవైపు బిహార్‌కు ప్రతీ రూపాయికి 219 పైసలు, ఉత్తర్ ప్రదేశ్‌కు 179 పైసల వంతున అందుతున్నాయి. మధ్యప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, దిల్లీ, పంజాబ్, హరియాణాలకు వాటి వాటా కంటే ఎక్కువే ముడుతోంది. మాతృ మరణాల రేటు, జనాభా పెరుగుదల రేట్లు, మహిళల్లో సంతానోత్పత్తి రేటు, అక్షరాస్యత తదితరాల్లో దక్షిణాది రాష్ట్రాలు పురోగమిస్తున్నా- కేంద్రం నుంచి తగిన సహాయం అందడం లేదు. ప్రైవేటు రంగ భాగస్వామ్యం, విదేశీ వాణిజ్యం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కేంద్రం నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఆశించిన ప్రాజెక్టులు రాలేదు. ప్రభుత్వరంగ సంస్థల్లో దేశంలోని 16 శాతం మాత్రమే దక్షిణాదికి వచ్చాయి. ఇందులో సగం ఇప్పటికే మూతపడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ తమ పార్టీ పాలిత రాష్ట్రాలనే ప్రత్యేకంగా పరిగణిస్తోందనే విమర్శలున్నాయి. దీనివల్ల మిగిలిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. ప్రాంతీయ సమతూకం లోపించడం వల్ల ఇబ్బందికర పరిణామాలు తలెత్తుతున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలకు ఇలాంటి చేదు అనుభవాలు తప్పడం లేదు. వ్యాపారవాతావరణం నెలకొనేలా చేసే విషయంలో మెరుగైన పనితీరు కనబరచినా, దక్షిణాది రాష్ట్రాలు చాలా దిగువ స్థాయిలో నిలిచాయి.
కొత్త ప్రాజెక్టులేవీ?
దేశంలో కొత్త ప్రాజెక్టుల్ని ప్రారంభించినప్పుడు కేంద్రం దక్షిణాదిని విస్మరిస్తోంది. రక్షణరంగ పరంగా తెలంగాణ, కర్ణాటక ముందంజలో ఉన్నాయి. ప్రఖ్యాత రక్షణరంగ సంస్థలు, పరిశ్రమలు, ప్రయోగశాలలు, పరిశోధన కేంద్రాల వంటివి ఇక్కడే ఉన్నాయి. ఏపీలో అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఉంది. చిన్నతరహా పరిశ్రమలు గణనీయంగా ఉన్నాయి. ఇన్ని అనుకూలతలున్న నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటక మధ్య రక్షణరంగ పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రధానమంత్రిని, కేంద్రమంత్రులను కలిసి అభ్యర్థించినా కేంద్రం పట్టించుకోలేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతానికి దీన్ని మంజూరు చేసింది. తెలంగాణ, కర్ణాటక మధ్య ఏర్పాటు చేస్తే రూ.20 వేల కోట్ల దాకా పెట్టుబడులను తేలికగా ఆకర్షించే వీలుండేది. రక్షణ రంగ ఉత్పత్తులకు ఊతం లభించేది. యువతకు, చిన్న పరిశ్రమలకు ఎంతగానో మేలు జరిగేది. ఆ కారిడార్ పూర్తిస్థాయిలో విజయవంతమయ్యేది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని మొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టును ముంబయి-అహ్మదాబాద్‌ల మధ్య చేపట్టింది. వాస్తవానికి దక్షిణ భారతానికి ఇలాంటి రైలు అవసరం ఉంది. మిగిలిన రైల్వే జోన్‌లతో పోలిస్తే దక్షిణమధ్య రైల్వే ఆదాయపరంగా అగ్రస్థానంలో ఉన్నా మార్గాల పరంగా ఇంకా ఆశించిన అభివృద్ధిని సాధించలేదు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కొత్త ప్రాజెక్టుల అవసరం ఉన్నా కేంద్రం ఆశించినంతగా చేయూతనివ్వడం లేదు. దిల్లీ-ముంబయి మధ్య పారిశ్రామిక కారిడార్ యూపీఏ ప్రభుత్వ హయాములో మంజూరయింది. రూ.1.10 లక్షల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు మౌలిక సదుపాయాల పరంగా ప్రపంచంలోనే అతిపెద్దది. ఆరు రాష్ట్రాల్లో 1,500 కి.మీ. పరిధిలో ఏర్పాటవుతోంది. 24 పారిశ్రామిక ప్రాంతాలు, ఎనిమిది ఆకర్షణీయ నగరాలు, రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు, అయిదు విద్యుత్ ప్రాజెక్టులు, రెండు రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్, రెండు లాజిస్టికల్ హబ్‌లు ఉన్నాయి. ఇలాంటి ప్రాజెక్టు కోసం దక్షిణాది రాష్ట్రాలు అభ్యర్థించగా చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ను మంజూరు చేస్తామని పదేళ్ల క్రితం కేంద్రం హామీ ఇచ్చింది. ప్రతిపాదనలు సిద్ధమైనా ఆచరణకు నోచుకోలేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్-బెంగళూరు- ఆంధ్రప్రదేశ్- చెన్నైల మధ్య పారిశ్రామిక కారిడార్ కోసం ప్రతిపాదించినా కేంద్రం నుంచి ఏ మాత్రం స్పందన లేదు. ఉమ్మడి రాష్ట్రంగా తెలంగాణకు ఐటీ పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) మంజూరయింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఐటీ రంగానికి భారీ స్థాయిలో లబ్ధి చేకూరేది. ఎన్డీయే ప్రభుత్వం దీన్ని ఏకపక్షంగా రద్దు చేసింది. విమానాశ్రయాల నిర్మాణం, జాతీయ రహదారుల నిర్మాణంలోనూ దక్షిణాది వెనకంజలోనే ఉంది.
కేంద్రంలో సమాఖ్య స్ఫూర్తి లోపిస్తోందనే విమర్శలున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు ప్రగతి పథంలో నడుస్తూ, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులోనూ ముందున్నాయి. సామాజిక వృద్ధిపై దృష్టి కేంద్రీకరించి పని చేస్తున్నాయి; ప్రజా సంక్షేమం కోసం భారీ ప్రాజెక్టులను చేపట్టాయి. సంస్కరణల ద్వారా పురోగమిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అండగా నిలవాలి. బిహార్, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు పలు ప్రామాణికాల్లో వెనకంజలో ఉన్నా కేంద్రం నుంచి నిధులకు లోటు ఉండటం లేదు. ఇలాంటి విధానం మారాలి. పన్నుల వాటాలో, కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో దక్షిణాది రాష్ట్రాలు ఆశిస్తున్న మార్పులకు అనుగుణంగా కేంద్రం సముచిత నిర్ణయాలు తీసుకోవాలి. అంతర రాష్ట్ర అసమానతల్నీ తొలగించాలి.
పరిష్కరించాల్సిన సమస్యలెన్నో...
ది నుంచీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం నిర్లక్ష్యం చేసిందనే విమర్శలున్నాయి. రాష్ట్ర విభజనకు దారి తీసిన పరిస్థితులకు ఇదీ ఒక కారణమే. 2014లో ఏపీ, తెలంగాణ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేదు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం చేతులెత్తేసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 219 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రం వద్ద అపరిష్కృతంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాలకు మంజూరైన జాతీయ పెట్టుబడులు పారిశ్రామిక మండళ్ల(నిమ్జ్)కు నిధులివ్వడం లేదు. ఏపీలోని సుదీర్ఘ తీర ప్రాంత అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదనే ఆరోపణలున్నాయి. ఔషధ, ఐటీ రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉన్నా కేంద్ర సాయం అందడంలేదు. దేశంలోనే అతిపెద్ద ఔషధ సమూహం ఔషధనగరిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూపాయైనా ఇవ్వలేదు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం సొంతంగానే నిర్మించింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు రూ.19,205 కోట్ల సాయం అందించాలని నీతిఆయోగ్ కేంద్రానికి ప్రతిపాదించినా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు.
- ఆకారపు మల్లేశం