దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి బాధితులు, పేదలకు సాయం చేస్తూ తన మంచి మనసును చాటుకుంటున్న నటుడు సోనూసూద్... మరోసారి ఉదారతను ప్రదర్శించారు. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఓ పేద మహిళకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
కర్ణాటకలోని యాదగిరి జిల్లా రామసముద్ర గ్రామానికి చెందిన నాగరాజు అనే దినసరి కూలీ భార్య పద్మ.. మూడు రోజుల క్రితం ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. పేదరికంతో బాధపడుతున్న ఆ కుటుంబ పరిస్ధితి గురించి స్థానిక పాత్రికేయుడు ఒకరు సోనూసూద్‌కు సమాచారం అందించారు. సాయం చేయాలని అభ్యర్ధించారు.
ఈ నేపథ్యంలో సోనూ.. పేదలకు సాయం కోసం నియమించిన తన బృందం బాధ్యుడు గోవింద్ అగర్వాల్‌ను వారికి సాయపడాలని సూచించారు. నాగరాజుతో మాట్లాడిన గోవింద్ అగర్వాల్... రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు, పిల్లలకు చికిత్స కోసం ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
మరో దీనగాథ..
బిహార్‌లో తూర్పు చంపారన్ జిల్లాలో ఇటీవల భారీగా వరదలు ముంచెత్తాయి. బంజారియా గ్రామానికి చెందిన షేక్ బోలాకు పాలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించేవాడు. అయితే, వరద నీటిలో కొట్టుకుపోతున్న తన గేదెను కాపాడబోయి అతని కుమారుడు ముకర్రం ప్రాణాలు కోల్పోయాడు.
ఇప్పటికే కుడి చేయి విరిగిన బోలా కుటుంబానికి.. గేదె నుంచి వచ్చే పాలే ఆధారం. ఫలితంగా రూ.60 వేలు అప్పు చేసి ఇంకో గేదెను కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని అదే గ్రామానికి చెందిన వ్యక్తి సోనూకు వివరించారు. స్పందించిన ఆయన.. బోలా కుటుంబంతో మాట్లాడారు. తప్పకుండా అప్పు తీర్చేందుకు కావాల్సిన మొత్తాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: సోనూ దాతృత్వం.. 20 వేల మంది కూలీలకు వసతి