దేశభక్తి అంటే వాట్సప్, ఫేస్‌బుక్‌లలో పోస్టులు పెట్టడం కాదు.. దేశానికి ఆపద వచ్చినప్పుడు వీలైనంత సాయం చేయడమని నిరూపించింది ఓ జవాను భార్య.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అగస్థ్యముని పట్టణానికి చెందిన శ్రీమతి దర్శిని దేవీ... ఇప్పుడు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. దేవీ భర్త భారత సైన్యంలో హవల్దార్‌గా సేవలందించారు. 1965లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో దేశం కోసం పోరాడి ఆయన వీరమరణం పొందారు. దేశభక్తినే నిలువెల్లా అలవరుచుకున్న దర్శిని దేవీ.. కరోనా విపత్తులో దేశానికి తనవంతు సాయం చేసింది. గ్రామ అధికారుల ద్వారా ప్రధాని సహాయ నిధికి ఇన్నేళ్లుగా తాను దాచుకున్న రూ.2లక్షలు విరాళంగా ఇచ్చేసింది.
ఆమె ఉదార గుణానికి యావత్ దేశం సలాం చేసింది. ఆమెను ఆదర్శంగా తీసుకొని దేశానికి సాయపడాలని స్వయంగా సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ పిలుపునిచ్చారు. ఆమెలా డబ్బులు చెల్లించలేకపోయినా కనీసం మనం కట్టాల్సిన పన్నులు సక్రమంగా కడితే చాలన్నారు. దేవీ చేసినపని భారత సైన్యానికే గర్వకారణమన్నారు.