గగనతలంలో అరుదైన సుందర దృశ్యమొకటి త్వరలో కనువిందు చేయనుంది. ఈ నెల 21న ‘వలయాకార సూర్యగ్రహణం’ ఆవిష్కృతం కానుంది. ఈ ఖగోళ పరిణామం ఫలితంగా ఆకాశంలో ‘జ్వాలా వలయం’ ఏర్పడుతుంది.
భారత్‌లో 21న ఉదయం 9:15కు గ్రహణం ప్రారంభమై, మధ్యాహ్నం 3:04కు ముగుస్తుంది. మధ్యాహ్నం 12:10కు గరిష్ఠ స్థితిలో ఉంటుంది. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఇదేకానుంది. ఉత్తర భారత్‌లో ఈ ఖగోళ పరిణామాన్ని వీక్షించవచ్చు.
సూర్యుడిని చందమామ పూర్తిగా కప్పివేస్తే సంపూర్ణ సూర్యగ్రహణంగా, కొంతమేరకే కప్పివేస్తే పాక్షిక సూర్యగ్రహణంగా చెబుతారు. వలయాకార సూర్యగ్రహణంలో సూర్యుడి కేంద్ర భాగం కనిపించకుండా జాబిల్లి అడ్డుగా ఉంటుంది. దీంతో చంద్రుడి వెనుక సూర్యుడి వెలుపలి భాగం వలయాకారంలో మెరుస్తూ కనువిందు చేస్తుంది. ఆ వలయాన్ని ‘జ్వాలా వలయం’గా పిలుస్తారు. ఒక్కోసారి ఒక సెకను కంటే తక్కువ కాలంలోనే జ్వాలా వలయం మాయమవుతుంది. కొన్నిసార్లు 12 నిమిషాలకుపైగా కనిపిస్తుంది.