చిన్న రైతులను ఆర్థికంగా ఉద్ధరించడంలో ఒప్పంద వ్యవసాయం పాత్ర అంతాఇంతా కాదు. చిన్న రైతులు బాగుంటే వ్యవసాయ రంగమూ బాగుపడుతుంది, యావత్ దేశం అభివృద్ధి పథంలో ఉరకలెత్తుతుంది. చిన్న రైతులకు కొత్త సాంకేతికతలు, కార్పొరేట్ నిర్వహణ మెలకువలు, రుణాలు, విపణి సమాచారం, సదుపాయాలు అందించడం ద్వారా వారు మార్కెట్లో సమర్థంగా పోటీపడగల సత్తాను ఒప్పంద వ్యవసాయం అందిస్తుంది.
ఈ తరహా సాగు చిన్న సన్నకారు రైతులకు వ్యాపార లావాదేవీల ఖర్చు తగ్గిస్తుంది. రైతులతో ఒప్పందం కుదుర్చుకునే కార్పొరేట్ సంస్థలు పంటల నాణ్యత పెంచడానికి ఉపకరించే అధునాతన సేద్య పద్ధతులు, యంత్రాలు, ఎరువులు, రుణాలు, పెట్టుబడులను వారికి అందిస్తాయి. ఒప్పంద వ్యవసాయం విజయవంతమైనప్పుడు ఆహార శుద్ధి పరిశ్రమలు, వ్యవసాయ ఎగుమతులు వృద్ధి చెందుతాయి. తద్వారా గ్రామీణుల ఆదాయా లు పెరిగి గ్రామాలు ఆర్థికంగా ముందడుగు వేస్తాయి.
నిబంధనల ఉల్లంఘన...
కంపెనీలు, రైతులు చాలాచోట్ల ఒప్పందాలను ఉల్లంఘించిన సందర్భాలు అనేకం. ఒప్పందంలో కుదుర్చుకున్న దానికన్నా విపణిలో ఎక్కువ ధర పలికితే రైతులు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారు. ఒప్పంద ధరకన్నా మార్కెట్ ధర బాగా తక్కువకు పడిపోతే కంపెనీలు ఉల్లంఘిస్తాయి. చిత్తూరు జిల్లాలో టమోటా రైతులకు ఈ చేదు అనుభవం పదేపదే ఎదురవుతోంది. కృష్ణా, ప్రకాశం, ఖమ్మం జిల్లాల్లో సుబాబుల్ రైతులకు కంపెనీలు చెల్లింపులను బాగా ఆలస్యం చేయడం ఆనవాయితీ అయిపోయింది.
చిత్తూరు జిల్లాలో ఘర్కిన్ దోసకాయల సాగుదారులకు కంపెనీలు మార్కెట్‌లో ఉన్నదానికన్నా తక్కువ ధర చెల్లిస్తున్నాయి. తమకు మంచి ధర రాదనుకున్నప్పుడు రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాలను పలుమార్లు ఉల్లంఘించాయి. ఒప్పందంలోని నిబంధనలకు మసిపూసి మారేడు చేయడం కంపెనీలకు రివాజుగా మారుతోంది. తమిళనాడు కోళ్ల రైతుల నుంచి బ్రాయిలర్ కోళ్ల కొనుగోలులో అవి గతంలో అవకతవకలకు పాల్పడ్డాయి. మార్కెట్‌లో తమకు మంచి ధర వస్తుందా లేదా అనేదాన్ని బట్టి కంపెనీలు ఒప్పందంలో సూచించిన గడువుకన్నా ముందుగానో, ఆలస్యంగానో కోళ్లను కొనడం చేస్తుంటాయి.
ఎలా అయినా రైతే నష్టపోవాలి తప్ప, తాము మాత్రం గట్టు మీద ఉండాలని చూస్తుంటాయి. రైతులకు చెల్లింపులను 60 రోజులవరకు ఆలస్యం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కంపెనీల నుంచి ముందుగానే పెట్టుబడులు తీసుకున్నారు కాబట్టి రైతులు ఏమీ చేయలేకపోతున్నారు. ఇలాంటివి జరగకుండా నివారించాలంటే ఒప్పందానికి ఇరువురూ జవాబుదారీ వహించేలా చట్టపరమైన ఏర్పాట్లు ఉండాలి. ఒక్కమాటలో ఒప్పందాన్ని కోర్టు ద్వారా అమలు చేసే అవకాశం ఉండాలి.
మొదట ఒప్పందాలను సాధికారంగా నమోదు (రిజిస్ట్రేషన్) చేయించాలి. ఇలాంటివేవీ లేకపోవడం వల్ల కంపెనీలు సకాలంలో సరకు తీసుకోకుండా మొరాయించడం, బోగస్ కంపెనీలు పుట్టుకొచ్చి రైతులను మోసగించడం, చెల్లింపులను ఆలస్యం చేయడం, లేదా కోత పెట్టడం వంటివి చేస్తుంటాయి. ఈ వాతావరణంలో రైతులకు, కాంట్రాక్టు కంపెనీలకు మధ్య పరస్పర నమ్మకం లోపిస్తోంది.
ఈ సవాళ్లను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం 2017 డిసెంబరు 24న నమూనా ఒప్పంద వ్యవసాయ ప్రోత్సాహక చట్టం ముసాయిదాను వెలువరించింది. రైతులకు ధరల హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పిస్తూ ఆహారశుద్ధి సంస్థలు కొత్త సాంకేతికతల్లో, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని ఈ చట్టం ముసాయిదా లక్షిస్తోంది. దీని ప్రాతిపదికపై దేశంలోనే మొట్టమొదటిసారి ఒప్పంద వ్యవసాయ చట్టం తీసుకొచ్చిన ఘనతను తమిళనాడు దక్కించుకొంది.
దాన్ని తమిళనాడు వ్యవసాయోత్పత్తులు, పాడి పరిశ్రమ ఒప్పంద వ్యవసాయం, సేవల ప్రోత్సాహక చట్టంగా వ్యవహరిస్తున్నారు. దీనికి ఇటీవలే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. మార్కెట్ హెచ్చుతగ్గులతో నిమిత్తం లేకుండా కంపెనీలు ఒప్పంద సమయంలో కుదుర్చుకున్న ధరను రైతులకు తప్పక ముట్టజెప్పేలా చూడటానికి ఈ చట్టం తెచ్చామని తమిళనాడు ప్రభుత్వం వివరించింది. ఈ ఒప్పందాలను రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్, వ్యవసాయ వ్యాపారాల విభాగం వద్ద తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలి.
ఒప్పందాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి, పరిస్థితులకు అనుగుణంగా మార్పుచేర్పులు సిఫార్సు చేయడానికి ఆరుగురు సభ్యులతో తమిళనాడు రాష్ట్ర ఒప్పంద వ్యవసాయం, సేవల ప్రోత్సాహక ప్రాధికార సంస్థను నెలకొల్పుతారు. పాడి, పంటల ఉత్పత్తి ప్రారంభం కావడానికి ముందు నుంచి పూర్తయ్యేవరకు కాంట్రాక్టు పరిధిలోకి వస్తాయి. ఈ ఉత్పత్తులను కొనడానికి అంగీకరించిన సంస్థల నుంచి ఉత్పాదకతను పెంచే సాంకేతికతలను, సాగు సాధనాలనూ రైతులు స్వీకరించే వెసులుబాటు కల్పించారు.
కేంద్రం, రాష్ట్రాలు, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) నిషేధించిన పంటను ఒప్పంద వ్యవసాయం కింద సాగు చేయకూడదు. ఒప్పంద వ్యవసాయ చట్టాన్ని త్వరగా అమలు చేయడానికి నియమ నిబంధనలను, విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అధికారులను ఆదేశించారు. మొత్తంమీద రాష్ట్ర చట్టం కేంద్ర ముసాయిదా ఆధారంగా రూపుదిద్దుకొన్నది. రాష్ట్ర ప్రభుత్వాలతో, సంబంధిత పక్షాలతో సంప్రతించిన తరవాతనే కేంద్రం ఆ ముసాయిదాను రూపొందించింది.
తమిళనాడు ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లోనే ఒప్పంద వ్యవసాయ చట్టం తీసుకొస్తామని ప్రకటించింది. దీన్ని అమలు చేయడానికి గ్రామ స్థాయిలోనే ఒప్పంద వ్యవసాయ ప్రోత్సాహక బృందాన్ని నెలకొల్పుతారు. ఒప్పంద వ్యవసాయ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తే వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు (ఏపీఎమ్‌సీ) లేదా మండీల్లో జరిగే అక్రమాల నుంచి రైతులను కాపాడవచ్చు. ఈ మండీల్లో వ్యాపారులు, దళారులు కలిసి కూటమిగా ఏర్పడి రైతులను మోసగిస్తున్నారనే ఆరోపణ చాలాకాలంగా వినవస్తున్న సంగతి తెలిసిందే. కొత్త చట్టం ఈ అక్రమానికి స్వస్తి చెబుతుందన్న అంచనాలున్నాయి.
విలువైన సూత్రాలు....
వ్యవసాయ ఒప్పంద చట్టాలు ఆశించిన ఫలితం ఇవ్వాలంటే కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. పొలం, గ్రామం, మార్కెట్ స్థాయిలో పంటలు, పాడి ఉత్పత్తుల గ్రేడింగ్‌కు ఒక యంత్రాంగం నెలకొల్పాలి. జరిమానాలు, అప్పీళ్లు, వివాద పరిష్కార ఏర్పాట్లు ఉండాలి. మధ్యవర్తిత్వంతో సంప్రతింపులు జరిపి వివాదాలను పరిష్కరించుకునే యంత్రాంగాన్ని ఏర్పరచాలి. రాష్ట్ర ప్రభుత్వం నియమించే అధికారులు వివాదాలను 15 రోజుల్లో పరిష్కరించాలి. వివాద పరిష్కారానికి కింది స్థాయిలో ఇచ్చిన ఉత్తర్వులపై ఉన్నత స్థాయిలో ఫిర్యాదు చేయవచ్చు.
కొత్త చట్టం కింద ప్రభుత్వం ఏర్పాటు చేసే ఒప్పంద వ్యవసాయ అభివృద్ధి, ప్రోత్సాహక ప్రాధికార సంస్థకు వివాద పరిష్కార అధికారం ఉంటుంది. అది ఇచ్చే తీర్పు సివిల్ కోర్టు తీర్పులా చలామణీ అవుతుంది. అయితే, ఈ చట్టం అమలులో ఎదురయ్యే వివాదాలపై తీర్పు చెప్పే అధికారం ఏ సివిల్ కోర్టుకూ ఉండదు. ప్రస్తుతం పలు రాష్ట్రాలు అమలుచేస్తున్న ఏపీఎమ్‌సీ చట్టాల్లో ఒప్పంద వ్యవసాయానికీ వెసులుబాటు ఉంది. ఏపీఎమ్‌సీలకు ఒప్పంద వ్యవసాయంలో మధ్యవర్తిత్వం లేకుండా చేయడానికి కేంద్రం కొత్త చట్టం ముసాయిదాను రూపొందించింది. చట్టం గురించి రైతుల్లో అవగాహన పెంచాలి.
అందరికీ ఆమోదయోగ్యమైన గ్రేడింగ్ యంత్రాంగం నెలకొల్పాలి. నిల్వ సౌకర్యాలు ఏర్పరచాలి. రైతులు వడ్డీవ్యాపారుల బారిన పడకుండా సకాలంలో సంస్థాగత రుణాలు అందించాలి. వ్యాపారులు, దళారులు కుమ్మక్కై పంట ధరలను పతనం చేయకుండా నివారించాలి. పట్టుదల, చిత్తశుద్ధితో అమలు చేస్తేనే ఈ తరహా కొత్త చట్టాలు విజయవంతమవుతాయి.
అవగాహనతో లాభాలు...
ఇటీవలి కాలంలో భారత్‌లో ఒప్పంద వ్యవసాయం కింద పూలు, పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం, పాడి, మత్స్య ఉత్పత్తి జోరందుకుంది. రైతులకు మెరుగైన సాంకేతికత, వ్యవసాయ విస్తరణ సేవలు అంది డబ్బు బాగా ఆదా అయింది. చాలాచోట్ల రైతులు, సంస్థలు కలిసి ఇప్పటికే ఒప్పంద వ్యవసాయం చేస్తున్నా సదరు ఒప్పందాలు చట్టపరంగా రెండు పక్షాలను జవాబుదారీ చేసేవిధంగా లేకపోవడం పెద్ద లోపం. ఇప్పటివరకు అన్ని ఒప్పందాలు పరస్పర నమ్మకం ఆధారంగానే అమలవుతున్నాయి. రానురానూ ఒప్పంద వ్యవసాయం కింద సాగయ్యే భూమి విస్తీర్ణం పెరుగుతోంది.
సేద్యంలో రైతులు, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం, ఉమ్మడి మార్కెటింగ్ విస్తరిస్తున్నాయి. ఒప్పంద వ్యవసాయంలో చిన్న సన్నకారు రైతులు దోపిడికి గురి కాకుండా రక్షించడానికి నియంత్రణపరంగా, చట్టపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా ఒప్పంద వ్యవసాయానికి దిగే కార్పొరేట్ సంస్థలు పెద్ద రైతులను భాగస్వాములుగా చేసుకోవాలనుకొంటాయి. చిన్న సన్నకారు రైతుల నిరక్షరాస్యత, పెట్టుబడుల లేమి, ఆధునిక సేద్య పద్ధతుల గురించి అవగాహనా లోపం కార్పొరేట్ సంస్థలు పెద్ద రైతుల వైపు మొగ్గేలా చేస్తున్నాయి.
చాలాచోట్ల ఒకే భారీ కంపెనీ వందలు, వేల చిన్న రైతుల నుంచి వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయడం జరుగుతోంది. చిన్న సన్నకారు రైతులకు విపణి పరిస్థితుల గురించి సమాచారం అందకపోవడం వల్ల తక్కువ ధరలకు పంటలను అమ్ముకొంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి.