కర్ణాటకలో ముఖ్యమంత్రి యడియూరప్ప నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం.. ప్రజల మద్దతు కోల్పోయిందని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఆయన.. భాజపా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. 2019లో వరద బాధితుల విషయంలో ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్రం నుంచి 35 వేల కోట్ల రూపాయలను కోరితే.. కేవలం రూ. 1,662 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపారు.
కరోనా నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. మంగళూరులో జరిగిన సీఏఏ నిరసనల్లో ఇద్దరు మరణించిన విషయాన్ని ప్రస్తావించారు సిద్ధరామయ్య. బెంగళూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటి ముందు జరిగిన అల్లర్ల విషయంలోనూ ప్రభుత్వం సరైన సమయంలో స్పందించలేదని మండిపడ్డారు.
"రాష్ట్రాన్ని పాలించడానికి మీకు అధికారమే లేదు. మీకు తగినన్ని ఓట్లు రాలేదు. ఆ సమయంలోనే 'ఆపరేషన్ కమలం' చేపట్టారు. యడియూరప్ప ఆపరేషన్ కమలానికి పితామహుడు."
-సిద్ధరామయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత.
ఓ కాంట్రాక్టు విషయంలో యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర లంచం తీసుకున్నారని సిద్ధరామయ్య ఆరోపించారు. రూ. 666 కోట్ల ప్రాజెక్టు దక్కించుకున్న బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ కాంట్రాక్టర్ నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నారని తెలిపారు. ఆర్టీజీఎస్ ద్వారా ఈ నగదు బదిలీ జరిగిందన్నారు. ఓ కన్నడ న్యూస్ ఛానెల్ చేసిన దర్యాప్తు ఆధారంగా ఈ ఆరోపణలు చేశారు సిద్ధరామయ్య.
నిజమైతే రాజీనామా చేస్తా: యడ్డీ
సిద్ధరామయ్య చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి యడియూరప్ప ఖండించారు. ఆయన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. ఈ ఆరోపణలు నిజమని రుజువు చేస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. లేదంటే సిద్ధరామయ్య రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు సిగ్గుపడాలని మండిపడ్డారు.