సమావేశాలు, సంప్రదింపులు, చర్చలతో మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ఇచ్చిన అహ్వానం గడువు దగ్గరపడుతున్న కొద్దీ.. శివసేన వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే భేటీ అయ్యారు. భాజపాతో తెగదెంపులు చేసుకున్న సేనకు ప్రభుత్వ ఏర్పాటులో మద్దతివ్వాలని పవార్‌ను కోరారు. ఇందుకు ఎన్సీపీ అధినేత సానుకూలంగా స్పందించారు.
సుమారు 45 నిమిషాల పాటు సాగిన అగ్రనేతల భేటీలో... ప్రస్తుత రాజకీయ పరిణామాలు సహా కనీస ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక, వ్యవసాయ సమస్యలపై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ నిర్ణయం కోసం ఎదురుచూపులు...
శివసేనకు మద్దతిస్తున్నట్టు ఎన్సీపీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు. ఈ అంశంపై కాంగ్రెస్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్టు.. పార్టీ కోర్ కమిటీ సమావేశం అనంతరం ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు. ఎన్నికల్లో కలిసి బరిలో దిగామని, ఎలాంటి నిర్ణయమైనా కలిసే తీసుకుంటామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ చర్చోపచర్చలు...
దిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. సాయంత్రం మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చించి, తీసుకునే నిర్ణయంపై ఆ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
ఎన్డీఏకు సేన గుడ్‌బై!
భాజపాపై తీవ్ర విమర్శలు చేస్తున్న శివసేన మరో అడుగు ముందుకేసింది. ఎన్డీఏకు దూరంగా జరుగుతున్నట్లు సంకేతాలిచ్చింది. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు కేంద్రమంత్రి, శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ప్రకటించారు. తొలుత 50-50 ఫార్ములాకు భాజపా అంగీకరించి.. ఇప్పుడు మాట మార్చిందని ఆరోపించారు.
ఇదీ చూడండి:- గవర్నర్ కోషియారీ చేతిలో 'మహా' భవిష్యత్తు!