శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిగా ఏర్పడడం పూర్తిగా అవకాశవాదమని భాజపా నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విమర్శించారు. వీరు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసినా.. అది 6 నుంచి 8 నెలలు దాటి మనలేదని జోస్యం చెప్పారు.
ప్రస్తుతం ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న నితిన్ గడ్కరీ.. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తు ప్రయత్నాలను తప్పుబట్టారు.
"శివసేన అవసరాలకు ఎన్సీపీ కూడా విలువనివ్వదు. చర్చలు, సిద్ధాంతాల ఆధారంగా ఈ కూటమి ఏర్పడలేదు. వారిది(శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ) అవకాశవాద కూటమి. ఇది మంచిది కాదు. మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు. ఒక వేళ ఇలాంటి ప్రభుత్వం వస్తే మహారాష్ట్రకు నష్టం వాటిల్లుతుంది. అస్థిరమైన ప్రభుత్వం మహారాష్ట్రకు మంచిది కాదు. "- నితిన్ గడ్కరీ, భాజపా నేత, కేంద్రమంత్రి
ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధం
ముఖ్యమంత్రి పీఠం విషయమై భాజపా, శివసేన మధ్య విబేధాలు రావడం వల్ల మహారాష్ట్రలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటుకాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించే పనిలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఉన్నాయి.
కూటమి విఫలమైతే..
కూటమి విఫలమైతే భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? అనే ప్రశ్నకు.. అలాంటి పరిస్థితుల్లో భవిష్యత్ వ్యూహాన్ని పార్టీ నిర్ణయిస్తుందని గడ్కరీ స్పష్టం చేశారు. క్రికెట్లోనూ, రాజకీయాల్లోనూ ఎప్పుడు ఏమైనా జరగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, ప్రధాని నరేంద్రమోదీ మధ్య జరిగిన సమావేశం గురించి తనకు ఏమీ తెలియదని గడ్కరీ అన్నారు.
ఇదీ చూడండి: 'గాంధీ'ల కోసం వచ్చేవారం లోక్‌సభలో 'ప్రత్యేక' బిల్లు