డీఎంకే సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె. అన్బళగన్ చెన్నైలో మృతి చెందారు. ఆయన వయస్సు 97 సంవత్సరాలు. వార్ధక్యం కారణంగా గత కొంతకాలంగా చెన్నై అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ తెల్లవారుజామున ఆయన మరణించారు.
తొమ్మిది పర్యాయాలు శాసనసభకు...
ద్రావిడ సిద్ధాంతకర్త పెరియార్ రామస్వామి నాయకర్ విధానాల పట్ల ఆకర్షితులై తొలుత ద్రావిడ కళగం ( డీకే) లో ఉన్నారు. అన్నాదురై 1949 లో పెరియార్ తో విభేదించి ద్రావిడ మున్నేట్ర కళగం స్థాపించినప్పుడు ఆ పార్టీలో వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. చెన్నై పచ్చయప్ప కళాశాలలో ప్రొఫెసర్ గా పని చేసినందున ఆయనను పార్టీలో అందరూ ప్రొఫెసర్ (తమిళంలో పేరాసిరియర్) అని వ్యవహరిస్తారు.1957 లో తొలిసారి తమిళనాడు శాసనసభకు ఎన్నికయ్యారు. మొత్తం తొమ్మిది పర్యాయాలు తమిళనాడు శాసన సభ్యులుగా ఉన్నారు. ఒకసారి పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు. 1971 నుంచి కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఆయన మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా సేవలందించారు.
కుడిభుజంగా..!
కరుణానిధికి ఆయన ఐదు దశాబ్దాలకు పైగా కుడిభుజంగా ఉన్నారు. పార్టీలో కరుణానిధితో సమానంగా గౌరవ మర్యాదలు అందుకున్న వ్యక్తి. బలగం మరణవార్త తెలియగానే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఇతర డీఎంకే నాయకులంతా అపోలో ఆస్పత్రికి చేరుకుని ఆయనకు అంజలి ఘటించారు అనంతరం ఆయన మృతదేహాన్ని చెన్నైలోని కిల్ పాకం లో ఉన్న ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ సాయంత్రం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సహా తమిళనాడులోని పలు పార్టీలకు చెందిన నాయకులు అన్బళగన్ భౌతికకాయానికి అంజలి ఘటించారు
ఇదీ చూడండి: మోదీ సర్కారుకు మన్మోహన్ మూడు సూత్రాలు