కరోనా సంక్షోభం కారణంగా రెండు నెలల క్రితం రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. అయితే ప్రత్యేక మార్గాల్లో నేటి నుంచి పాసింజర్ రైళ్లను దశలవారిగా పునరుద్ధరించనున్నారు. లాక్డౌన్ కాలంలో నిత్యవసరాలు చేరవేసేందుకు గూడ్స్ రైళ్లు మాత్రమే నడిపారు. పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తమ స్వస్థలాకు తరలించేందుకు మే 1 నుంచి 'శ్రామిక్' పేరుతో ప్రత్యేక రైళ్లు ప్రారంభించింది రైల్వే శాఖ. ప్రస్తుతం పునరుద్దరించబోయే 30 రైళ్ల ప్రయాణం.. లాక్డౌన్ విధించక ముందు కంటే భిన్నంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇవి తప్పనిసరి..
ఇప్పటికే ప్రయాణికులకు ఈ రైళ్లలో ప్రయాణించడానికి పలు మార్గదర్శకాలు జారీ చేసింది రైల్వే శాఖ. ముఖ్యంగా 'ఈ-టిక్కెట్ ఉండాలి. స్టేషన్‌కు 90 నిమిషాలు ముందే చేరుకోవాలి. మాస్కు తప్పనిసరి ధరించాలి. చరవాణిలో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి' వంటి నిబంధనలు పాటించాలని సూచించింది.
అంతే కాకుండా రైళ్లో ప్రయాణించే వారు ఒకరికి ఒకరు ఎదురు పడకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. రైళ్లు ఎక్కేవారు ఒక ద్వారం నుంచి.. దిగేవారు మరో ద్వారం నుంచి దిగాలని సూచించారు. సురక్షితమైన ప్రయాణం కోసం రైళ్లు, స్టేషన్లలో భౌతిక దూరం, పరిశుభ్రత పాటించాలన్నారు అధికారులు.
రైళ్ల జాబితా
మే 12 నుంచి మే 20 వరకు నడిచే రైళ్ల జాబితాకు సంబంధించి టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది రైల్వే శాఖ. రోజు... వారానికి ఒక్కసారి నడిచేవి... వారం వారం నడిచే రైళ్లను ఈ జాబితాలో పేర్కొన్నారు. దీని ప్రకారం మే 16, 19 తేదిల్లో అన్ని రైళ్లు రద్దు అయినట్లు తెలుస్తోంది. ఈ రైళ్లు అన్ని దిల్లీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ముఖ్య నగరాలు, పట్టణాలైన- దిబ్రుగఢ్, అగర్తలా, హావ్‌డా, పట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడగావ్, ముంబయి సెంట్రల్, అహ్మదాబాద్, జమ్ము తావి మధ్య తిరగనున్నాయి.
ఏ తేదీన...ఎక్కడి నుంచి...ఎన్ని రైళ్లు...
- మే 12న మూడు రైళ్లు దిల్లీ నుంచి బయలుదేరనున్నాయి. ఇవి దిల్లీ నుంచి దిబ్రుగఢ్, బెంగళూరు, బిలాస్‌పుర్ చేరనున్నాయి. మరికొన్ని హావ్‌డా, పట్నా, బెంగళూరు, ముంబయి సెంట్రల్, అహ్మదాబాద్ నుంచి బయలుదేరి దిల్లీ చేరనున్నాయి.
- మే 13న తొమ్మిది రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇందులో ఎనిమిది రైళ్లు దిల్లీ నుంచి బయలుదేరి హావ్‌డా, రాజేంద్ర నగర్ (పట్నా), జమ్మూ తావి, తిరువనంతపురం, చెన్నై, రాంచీ, ముంబయి, అహ్మదాబాద్ చేరుకుంటాయి. ఒక ప్రత్యేక రైలు భువనేశ్వర్ నుంచి దిల్లీ చేరుకోనుంది.
- మే 14న నాలుగు రైళ్లు తిరగనున్నాయి. దిబ్రుగఢ్, జమ్ముతావి, బిలాస్‌పుర్, రాంచీ నుంచి దేశ రాజధానికి చేరుకుంటాయి. ఒక రైలు దిల్లీ నుంచి భువనేశ్వర్ చేరుకుంటుంది.
- మే 15న రెండు రైళ్లు తిరువనంతపురం, చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరగా... మరొకటి దిల్లీ నుంచి మడగావ్కు చేరుకుంటుంది.
- మే 17న లాక్డౌన్ ముగిసిన నాటికి మడగావ్ నుంచి దిల్లీ మధ్య ఒకటి, దిల్లీ నుంచి సికింద్రాబాద్ మధ్య తిరగనున్నాయి.
- మే 18న అగర్తలా నుంచి దేశ రాజధాని మధ్య ప్రయాణించనుంది.
- మే 20న రెండు రైళ్లు దిల్లీ నుంచి అగర్తలా, సికింద్రాబాద్ నుంచి దిల్లీ ప్రయాణిస్తాయి.
రద్దు చేసుకుంటే 50 శాతం రుసుము...
ఈ ప్రత్యేక రైళ్లలో కేవలం ఏసీ బోగిలే ఉంటాయి. అయితే వాటి ఛార్జీలు రాజధాని రైళ్లకు సమానంగా ఉంటాయని వెల్లడించారు. శ్రామిక వర్గాల వారిని తమ స్వస్థలాకు చేరవేసేందుకు రైళ్ల సేవలు పునరుద్ధరించడానికి నిర్ణయించారు. ఈ రైళ్లకు 7 రోజుల ముందు రిజర్వు చేసుకోవచ్చు. ఆర్ఏసీ, వెయిటింగ్ జాబితాలో ఉన్నవారిని కూడా అనుమతించనున్నారు. ఒకవేళ టిక్కెట్ రద్దు చేసుకోవాలంటే 24 గంటల గడువు మాత్రమే ఉంటుంది. దీనికి గాను 50 శాతం రుసుము చెల్లించుకోవాలని అధికారులు తెలిపారు.
మార్గదర్శకాలకు అనుగుణంగా...
టిక్కెట్ పర్యవేక్షక సిబ్బందికి రైళ్ల ప్రయాణానికి అనుమతి ఉండదని తెలిపారు. గమ్యస్థానాలకు చేరుకున్నవారు ఆయా రాష్ట్రాల నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. బిస్కెట్లు వంటి తినుబండరాలు రైల్వే కేటరింగ్ సిబ్బంది విక్రయిస్తారని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: లాక్‌డౌన్‌పై మోదీతో ముఖ్యమంత్రులు ఏమన్నారంటే!