సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్టుతో.. బెంగళూరు నగరంలో మంగళవారం రాత్రి అల్లర్లు చెలరేగాయి. రెచ్చిపోయిన అల్లరిమూకలు.. పెద్దఎత్తున విధ్వంసానికి దిగారు. అల్లరి మూకలను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.
ముందు జాగ్రత్తచర్యగా బెంగళూరులో 144 సెక్షన్ విధించగా... అల్లర్లు జరిగిన డీజే హళ్లి, కేజే హళ్లి ఠాణాల పరిధిలో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.
సీఎం యడియూరప్ప పరిస్థితి సమీక్షించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
ఫేస్‌బుక్‌లో పోస్ట్‌తో...
ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా కర్ణాటకకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువు సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడం వల్ల బెంగళూరు నగరం భగ్గునమండింది. మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మొదలైన అల్లర్లు.. ఈ తెల్లవారుజాము వరకు కొనసాగాయి. 3 వేల మందికిపైగా దుండగులు రెచ్చిపోయి దాడులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటితోపాటు డీజే హళ్లి పోలీసు ఠాణాపై నిరసనకారులు దాడి చేశారు. ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉన్న, ఠాణా ఎదుట ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. పదుల సంఖ్యంలో వాహనాలు మంటల్లో తగులబడ్డాయి. అల్లరిమూకల రాళ్లదాడిలో ఏసీపీ ఫాతిమా సహా 70 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు లాఠీఛార్జ్ చేశారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. పరిస్థితి తీవ్ర హింసాత్మకంగా మారడం వల్ల పోలీసులు కాల్పులు జరిపారు. అవసరమైతే ఆర్ఏఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించనున్నట్ల బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ తెలిపారు.
ఈ కాల్పుల్లో ముగ్గురు నిరసనకారులు మరణించారు. వారిలో ఇద్దర్ని గుర్తించినట్లు తెలిపిన పోలీసులు.. మరొకరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. వందకుపైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్టు చేసి.. అల్లర్లకు కారణమైన ఎమ్మెల్యే అల్లుడు నవీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సంయమనం పాటించాలని పులకేసి నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి.. నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు.
యడియూరప్ప సమీక్ష...
బెంగళూరులో తాజా పరిస్థితిని సీఎం యడియూరప్ప సమీక్షించారు. అల్లర్లకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉన్నట్లు యడియూరప్ప తెలిపారు. పోలీసులు, పాత్రికేయులపై దాడులు ఆమోదయోగ్యం కాదన్నారు. కవ్వింపు చర్యలతోపాటు వదంతులను ప్రభుత్వం ఉపేక్షించదని సీఎం యడియూరప్ప హెచ్చరించారు.
కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీలు ఈ దాడులను ఖండించాయి. అల్లర్లను అదుపు చేసేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తెలిపారు.
ఇదీ చూడండి:- తుపాకీతో కాల్చుకున్న సీఆర్పీఎఫ్ అధికారి