మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో మొన్నటి వరకు కీలకంగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా భాజపాలో చేరారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కండువాకప్పి ఆయనను ఆహ్వానించారు అధ్యక్షుడు జేపీ నడ్డా.
భాజపాలో చేరిన అనంతరం కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు సింధియా. ఆ పార్టీలో పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రజల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు.
" కాంగ్రెస్‌లో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునే పరిస్థితి లేదు. కొత్త ఆలోచనలను స్వీకరించి కొత్తవారికి అవకాశం కల్పించే వాతావరణం లేదు. నా సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో 2018లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 18 నెలల్లోనే ప్రజల కలలు నీరుగారిపోయాయి. 10రోజుల్లో రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. 18నెలలు గడిచినా చేయలేదు. యువతకు ఉపాధి కల్పన లేదు. కాంగ్రెస్ పాలన అవినీతిమయమైంది."
-జ్యోతిరాదిత్య సింధియా, భాజపా నేత.
తన తండ్రి చనిపోయిన 2001 సెప్టెంబర్ 30వ తేదీ, జీవితంలో కొత్త నిర్ణయం తీసుకున్న 2020 మార్చి 10వ తేదీలను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు సింధియా. ప్రజలకు సేవ చేయడానికి నరేంద్ర మోదీ, అమిత్‌షా తనకు అవకాశం కల్పించారని, అందుకే భాజపాలో చేరినట్లు పేర్కొన్నారు.
నాటకీయ పరిణామాలు
మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్నారు సింధియా. అందుకే తన అనుచర వర్గం మద్దతుతో హస్తం పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేశారు. ఆయన నిర్ణయంతో మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. 22మంది ఎమ్మెల్యేలు సింధియాకు మద్దతుగా శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరంతా బెంగళూరులోని రిసార్టులో ఉన్నారు.
భాజపాలో చేరిన సింధియాకు రాజ్యసభ సీటు దక్కుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇదీ చూడండి: ఆ ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత