నిర్భయ దోషి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్ కుమార్ శనివారం అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశాడు.
జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు పిటిషన్‌ను విచారించనుంది.
ముకేష్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఈనెల 17న తిరస్కరించారు. ఈ నేపథ్యంలో తన పిటిషన్‌ను వెంటనే విచారణ చెయ్యాలని నిర్భయ దోషి ముకేశ్ కుమార్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డేతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్పందించి... కోర్టు రిజిస్ట్రరీలో ఈ పిటిషన్‌ను చేర్చమని అతడి తరఫు న్యాయవాదికి సూచించింది. ఉరిశిక్ష పడిన వ్యక్తి పిటిషన్ విచారణకు మించి అత్యవసరమైనది ఏదీ లేదని సీజేఐ అన్నారు. ఈ పిటిషన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు ఉరి ట్రయల్స్
మరోవైపు ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 6 గంటలకు దోషులను ఉరి తీయడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉరి తీసే ప్రక్రియకు సంబంధించిన ట్రయల్స్‌ను తీహార్ జైలు అధికారులు సోమవారం పూర్తి చేశారు. ఉరి తీసే పరికరాలను పరీక్షించడానికి మూడోసారి ఈ ట్రయల్స్ నిర్వహించారు. రానున్న రోజుల్లో కూడా పరికరాలను పరీక్షిస్తామని స్పష్టం చేశారు.