కర్ణాటకలో ప్రభుత్వాన్ని కాపాడుకునే విషయంలో ముఖ్యమంత్రి యడియూరప్ప గొంతుతో బయటపడ్డ ఆడియో క్లిప్పుల వ్యవహారాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఆడియా క్లిప్పులను పరిగణనలోకి తీసుకొని.. విచారించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కాంగ్రెస్.
కాంగ్రెస్ వ్యాజ్యాన్ని స్వీకరించిన జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం... ఈ అంశం గతంలో కూడా తమ ముందుకు వచ్చిందని గుర్తు చేసింది. 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ రమేశ్ వేటు వేయడాన్ని సవాల్ చేసిన కేసును ప్రస్తావించింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా...ఆడియో క్లిప్పును కూడా పరిశీలించాలని కాంగ్రెస్ ఈ పిటిషన్‌లో అభ్యర్థించింది.
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు కోసం శాసనసభ్యులను ఆకర్షించేందుకు యడియూరప్ప ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారమంతా భాజపా అధ్యక్షుడు అమిత్‌షా ఆధ్వర్యంలోనే జరుగుతోందని యడియూరప్ప ఈ ఆడియో క్లిప్పులో వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుకు సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయిని సంప్రదిస్తామని... ధర్మాసనం సోమవారం తెలిపింది.
ఇదీ చూడండి:అయోధ్య కేసు తీర్పు విజయోత్సవాలపై ఆంక్షలు