లాక్డౌన్ కారణంగా వేతనాలు లేక ఆకలితో అలమటిస్తున్న రోజువారీ కూలీలకు ప్రభుత్వాలే వేతనాన్ని చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్‌పై మరోసారి వాదనలు వినింది సుప్రీంకోర్టు. ఈ అంశంపై కేంద్రాన్ని వివరణ కోరగా పూర్తిస్థాయి అఫిడవిట్‌ను అత్యున్నత న్యాయస్థానికి సమర్పించింది ప్రభుత్వం. పూర్తి వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ప్రభుత్వమే ఆదుకోవాలి
లాక్డౌన్ కారణంగా వలస కూలీలు, రోజువారీ కూలీలు, రిక్షా నడిపేవారు, చిన్న ఉద్యోగ కార్మికులు తినడానికి ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారని... అలాంటి వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని పిటిషనర్లు కోరారు. అంతేకాకుండా వందలాది కూలీలు సొంతింటికి వెళ్లేందుకు బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, రాష్ట్రాల సరిహద్దుల్లో తీవ్రప్రయత్నాలు చేస్తున్నారని.. తద్వారా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వాదించారు. అందుకే వలస కూలీలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వ్యాజ్యంలో పేర్కొన్నారు.
వలస కూలీల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా హెల్ప్లైన్లను ఏర్పాటు చేసినట్లు సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఈ ప్రక్రియను స్వయంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుందని కోర్టుకు వెల్లడించారు. వారికి ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పిస్తున్నందున వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు.
ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం.. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. 10-15 రోజుల వరకు ఈ అంశంలో ప్రభుత్వ చర్యలపై స్పందించ లేమని తెలిపిన ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.