కొవిడ్-19 చికిత్సకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులకు ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ బి.ఆర్.గవాయ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.
'కరోనా కారణంగా కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటోంది. అలాంటి వారికి మలేరియా నిరోధక ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్, యాంటీ బయాటిక్ ఔషధం అజిత్రోమైసిన్ ఇవ్వడం వల్ల తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని అమెరికన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ హెచ్చరించింది. వీటిని పరిగణనలోకి తీసుకుని భారత్‌లో కరోనా చికిత్సకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులు చేయాలి' అని అమెరికాలోని భారత సంతతి వైద్యుడు కునాల్ సహ పిటిషన్ వేశారు.
అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఐసీయూలో ఉన్న కొవిడ్-19 బాధితులకు హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్‌లతో చికిత్స అందించవచ్చని ఆరోగ్యశాఖ పేర్కొందని ఆందోళన వ్యక్తం చేశారు. చికిత్స విషయమై సూచనలివ్వడానికి కోర్టుకు వైద్యపరమైన నైపుణ్యం ఉండదని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్‌లో ప్రస్తావించిన అంశాలను భారత వైద్య పరిశోధన మండలి దృష్టికి తీసుకెళ్లాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.
'రేషన్ ఇచ్చే విషయమై నిర్ణయం తీసుకోండి'
రేషన్ కార్డులు లేనివారికి చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరకులను అందించే విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది విధానపరమైన అంశమని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం వీడియో ద్వారా విచారణ చేపట్టింది.
రేషన్‌కార్డులు లేని అవసరార్థులకు చౌకధరల దుకాణాల ద్వారా సరకులు అందించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ను ‘యూనివర్సలైజేషన్’ చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు. పీడీఎస్ యూనివర్సలైజేషన్‌పై తాము ఇదివరకే ఆదేశించినట్టు ధర్మాసనం పేర్కొనగా... ఆ ఆదేశాలు కేవలం కార్డుదారులకు మాత్రమే వర్తిస్తున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.
తెలంగాణ, దిల్లీ వంటి రాష్ట్రాలు కార్డులు లేనివారికి కూడా సరకులను అందిస్తున్నాయని తెలిపారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ... రేషన్ కార్డులకు ప్రత్యామ్నాయంగా మరేదైనా ధ్రువీకరణ పత్రాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చేమో ప్రభుత్వాలు నిర్ణయించాలంది.