కేంద్రం, ఈసీలు అభ్యర్థుల నేరచరిత్ర సేకరించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేశారు. శుక్రవారం ఈ కేసుపై వాదనలు విన్న ధర్మాసనం... ఈసీతో పాటు కేంద్రానికి తాఖీదులు జారీ చేసింది.
" దేశంలోని ప్రముఖ వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు ఏమిటో అభ్యర్థులకు ఈసీ తెలపలేదు. నిర్ణీత సమయాల్లోనే అభ్యర్థులు వారి నేరచరిత్రను పత్రికల్లో ప్రచురించాలని నిబంధనలు కూడా విధించలేదు. అందువల్ల టీవీలను ఎక్కవమంది చూడని సమయాల్లో రాజకీయ నేతలు వారి నేరచరిత్రను ప్రసారం చేశారు. రాజకీయ పార్టీలు వారి అభ్యర్థుల నేర చరిత్ర వివరాలను వెబ్సైట్లో గానీ, వార్తా పత్రికలో గానీ ప్రచురించలేదు. టీవీ ఛానెళ్లలోనూ ప్రసారం చేయలేదు. ఇలాంటి రాజకీయ పార్టీలు, అభ్యర్థులపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అభ్యర్థులు నేర చరిత్ర వివరాలు ప్రకటించకుండానే ఈసీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసి, 2018 సెప్టెంబర్ 25 నాటి కోర్టు తీర్పును ధిక్కరించింది. "
- అశ్విని కుమార్ ఉపాధ్యాయ్, న్యాయవాది
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు వారి నేర చరిత్రను ఈసీకి తెలపాల్సిందిగా గతేడాది సెప్టెంబర్ 25న సుప్రీం తీర్పునిచ్చింది. ప్రముఖ వార్తాపత్రికలు, టీవీలు, పార్టీ వెబ్సైట్లలో వివరాలను వెల్లడించాలని ఆదేశించింది.