సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ కల్పించాలని సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. సాయుధ దళాల్లో లింగ వివక్షకు ముగింపు పలికేలా ఈ నిర్ణయం తీసుకోవాల్సిందేనని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. సైన్యంలో ఉన్న మహిళలకు మూడు నెలల్లోగా శాశ్వత కమిషన్ కల్పించాలని, వారందరూ.. కమాండ్ పోస్టులు చేపట్టేందుకు కూడా అర్హులేనని స్పష్టం చేసింది.
2010లో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని సుప్రీంను ఆశ్రయించింది కేంద్రం. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. దిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించింది.
సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ కల్పించకూడదన్న నిబంధన హేతువిరుద్ధమని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రభుత్వ నిర్ణయం సమానత్వ హక్కుకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. శారీరక పరిమితులు, సామాజిక నిబంధనలతోనే సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్ ఇవ్వలేకపోతున్నామన్న కేంద్రం వాదనలను తోసిపుచ్చింది సుప్రీం.