పౌరసత్వ చట్టం రాజ్యాంగబద్ధతను పరిశీలించేందుకు అంగీకరించింది సుప్రీం కోర్టు. కానీ.. ఆ చట్టం అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది. పౌర చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. ఇందుకు జనవరి రెండో వారం వరకు గడువు ఇచ్చింది.
ఐయూఎంఎల్, కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ సహా పలువురు దాఖలు చేసిన 59 పిటిషన్లపై.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సుదీర్ఘ వాదనల అనంతరం పౌర చట్టం అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను జనవరి 22కు వాయిదా వేసింది.
సీఏఏ అవగాహనపై..
పౌర చట్టం లక్ష్యం, అందులోని అంశాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందనే అంశంపై న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ వాదనలు వినిపించేందుకు విన్నవించగా అందుకు అంగీకరించింది ధర్మాసనం. సాధారణ ప్రజలకు పౌర చట్టంపై అవగాహన కల్పించాలని ప్రభుత్వ తరఫున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు సూచించింది. అందుకోసం ఆడియో, వీడియో మాధ్యమాలను వినియోగించుకోవాలని తెలిపింది.
ధర్మాసనం సూచనల అమలుకు సుముఖత తెలిపారు వేణుగోపాల్. అత్యవసరమైన ఈ అంశాన్ని ప్రభుత్వం తప్పకుండా చేపడుతుందని తెలిపారు.
పిటిషనర్ల వాదనలు..
విచారణలో భాగంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కొందరు నూతనంగా తీసుకొచ్చిన చట్టంపై స్టే విధించాలని కోరారు. రాజ్యాంగ విరుద్ధంగా పౌర చట్ట సవరణ చేపట్టారని వాదించారు. ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పిస్తూ కేంద్రం వివక్షాపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఈ వాదనలను తోసిపుచ్చారు అటార్నీ జనరల్ వేణుగోపాల్. చట్టంగా రూపొందిన తర్వాత దానిపై స్టే విధించలేమని గతంలో నాలుగు కోర్టు తీర్పులు ఉన్నట్లు గుర్తు చేశారు.
ఐయూఎంఎల్ తరఫు న్యాయవాది పల్లవి ప్రతాప్.. పౌర చట్టం అమలు, విదేశీయుల సవరణ ఆదేశాలు-2015, పాస్‌పోర్ట్ నియమాల సవరణ-2015లపై స్టే విధించాలని కోరారు.
పౌర చట్ట సవరణలో పలు అంశాలు, నియమాలు ఇంకా రూపుదిద్దుకోని కారణంగా స్టే విధించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు ఓ కక్షిదారు తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్.
ఇదీ చూడండి: 'నిర్భయ' దోషులకు ఉరి ఆలస్యం- జనవరి 7న నిర్ణయం!