తబ్లీగీ జమాత్ కార్యకలాపాల్లో భాగస్వాములైన 2,500 మందికిపైగా విదేశీయులను 10ఏళ్లపాటు భారత్‌లోకి రాకుండా నిషేధించిన వ్యవహారంలో.. వారి వీసాల స్థితిపై తన వైఖరిని స్పష్టం చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు. వీసా రద్దుకు సంబంధించి వ్యక్తిగతంగా అందరికీ నోటీసులు జారీ చేశారా? లేదా? అనే విషయాన్ని తెలపాలని స్పష్టం చేసింది.
తమను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ విదేశీయులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ చేపట్టింది జస్టిస్ ఏ ఎమ్ ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సంజివ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం. ఒక వేళ విదేశీయుల వీసాలను రద్దు చేస్తే.. వారు ఇంకా దేశంలోనే ఎందుకు ఉన్నారన్న విషయాన్ని వివరించాలని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, న్యాయవాది రజత్ నాయర్‌కు సూచించింది అత్యున్నత న్యాయస్థానం.
అయితే వ్యాజ్యాలకు సంబంధించిన పత్రాల కాపీ తమకు అందలేదని కోర్టుకు తెలియజేశారు న్యాయవాది రజత్ నాయర్. అందువల్ల ఈ వ్యవహారంపై స్పందించడానికి సమయం కావాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే పిటిషనర్ల తరఫు న్యాయవాది సి.యు.సింగ్ మాత్రం.. పత్రాలను కేంద్రానికి ఇంతకు ముందే అందించినట్టు కోర్టుకు తెలిపారు.
నిషేధానికి సంబంధించిన ఆదేశాలు ఎప్పుడు అందాయని సింగ్‌ను అడిగింది సుప్రీం ధర్మాసనం. దీనికి సంబంధించి వ్యక్తిగతంగా ఎవరికీ నోటీసులు అందలేదని.. కేవలం సాధారణ ఆదేశాలను చూసినట్టు పేర్కొన్నారు. అనంతరం ఈ పూర్తి వ్యవహారంపై కేంద్రం స్పందించాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను జులై 2కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
ఇదీ చూడండి:- 'ఇదంతా తబ్లీగీల వల్లే... వారి నేరాలకు శిక్ష తప్పదు'