కర్ణాటకలో అనర్హతకు గురైన 17 మంది ఎమ్మెల్యేల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటూ అనర్హత ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ఈ నెల 25న విచారణ చేపడతామని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
అనర్హతకు గురైన ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అప్పటి సభాపతి ఆదేశాల ప్రకారం...అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో వాదనలు వినిపించిన కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది... కర్ణాటకలో ఖాళీ అయిన 15 అసెంబ్లీ స్థానాలను నోటిఫై చేశామని వివరించారు.
ఈ దశలో ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వజాలదని పేర్కొన్నారు. సభాపతి అనర్హత వేసినంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేయకుండా వీరి హక్కులను కాలరాయలేరని కోర్టుకు తెలిపారు. అనంతరం అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు ఎందుకు పోటీ చేయకూడదో సమాధానం చెప్పాలంటూ కర్ణాటక స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.