కాంగ్రెస్-ఎన్సీపీ అవినీతి కూటమని తీవ్ర ఆరోపణలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు నేతలు ఆర్టికల్ 370తో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధమేంటని ప్రశ్నిస్తున్నారని, వారికి ఎంత ధైర్యమని మండిపడ్డారు.
మహారాష్ట్ర అకోలాలో ఎన్నికల ర్యాలీకి హాజరయ్యారు మోదీ. హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్ విలువలను కొనియాడారు.
"కొంతమంది నేతలు వీర్ సావర్కర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు. అవమానిస్తున్నారు. సావర్కర్ విలువల ఆధారంగానే జాతీయవాదాన్ని దేశ నిర్మాణానికి పునాదులుగా చేశాం. "
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.
సావర్కర్‌కు భారత రత్న ఇవ్వాలని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది అధికార భాజపా. ఈ హామీని ప్రత్యర్థి పార్టీలు తప్పుబట్టాయి. ఆ విమర్శలను తిప్పికొడుతూ ర్యాలీలో సావర్కర్‌ను ప్రస్తావించారు మోదీ.
మహారాష్ట్రలో ఒకప్పుడు తరచూ ఉగ్రవాద ఘటనలు జరుగుతుండేవన్నారు మోదీ. అందుకు బాధ్యులైన వారు దేశం వీడి పారిపోయి విదేశాల్లో తలదాచుకుంటున్నారని చెప్పారు. ఆ సమయంలో అధికారంలో ఎవరు ఉన్నారో గుర్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు మోదీ. వారంతా ఎలా తప్పించుకున్నారని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: అతి త్వరలో మోదీ-ఇమ్రాన్ భేటీ..!