పౌరసత్వ చట్టంపై పలు ప్రాంతాల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే భాజపా మిత్రపక్షమైన శిరోమణి అకాలీ దళ్ మొదటి నుంచి సీఏఏను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా వచ్చే నెలలో జరగనున్న దిల్లీ ఎన్నికలకు శిరోమణి అకాలీ దళ్ దూరంగా ఉండనున్నట్లు ఆ పార్టీ నేత మన్జిందర్ సింగ్ సిర్సా తెలిపారు.
సీఏఏపై తమ పార్టీ వైఖరి మార్చుకోవాల్సిందిగా భాజపా కోరిందని.. ఇందుకు తాము ఒప్పుకోలేదని వెల్లడించారు. ఈ కారణంగానే దిల్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని మీడియా సమావేశంలో వివరించారు.
"భాజపా-ఎస్ఏడీ సమావేశంలో.. సీఏఏపై మా నిర్ణయాన్ని మార్చుకోవాలని వారు కోరారు. అయితే సీఏఏపై మేము ఒక కచ్చితమైన నిర్ణయం ఇప్పటికే తీసుకున్నాం. ముస్లింలను ఇందులో నుంచి తప్పించడం ఎంతమాత్రం ఒప్పుకోం. జాతీయ పౌర జాబితానూ (ఎన్ఆర్సీ) మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం." - మన్జిందర్ సింగ్ సిర్సా, ఎస్ఏడీ నేత