"ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అధికారం విషయంలో మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు. దేశాధినేతల్లో మహిళల సంఖ్య 7శాతంకన్నా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్టసభ్యుల్లో మహిళలు 24శాతమే."
--ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక సారాంశం
ఐరాస చెప్పిన వాస్తవాలకు భారత్ అతీతం కాదు. 543 సీట్లుండే లోక్‌సభలో ప్రస్తుతమున్న మహిళల సంఖ్య 61. అంటే... 11.2శాతం.
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంపుపై ఎప్పటినుంచో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. 33శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు ఆమోదం కోసం డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఏళ్లు గడిచినా ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. ఈసారి మాత్రం ఖాయం అంటున్నాయి రాజకీయ పార్టీలు. సార్వత్రిక ఎన్నికల వేళ ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా, మహిళా ఓటర్లను ఆకట్టుకునే ఆయుధంగా మార్చుకున్నాయి.
రిజర్వేషన్లు ఖాయం!
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ... మహిళా దినోత్సవం రోజున రిజర్వేషన్ల హామీ ఇచ్చారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటనల సందర్భంగా ఉచిత విద్య, మహిళా సాధికారతకు చర్యలు వంటి వాగ్దానాలు చేశారు.
లోక్‌సభ, విధాన సభల్లో మహిళలకు రిజర్వేషన్ కోసం ఉద్దేశించిన బిల్లును 2019లో ఆమోదిస్తాం. కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో 33శాతం మహిళలకే కేటాయిస్తాం.
-రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
ఒడిశాలో 33 శాతం కోటా....
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఒడిశా ఆసెంబ్లీ గత సంవత్సరం తీర్మానించింది. ఇందుకు కొనసాగింపుగా... ఎన్నికల వేళ మరో అస్త్రం ప్రయోగించారు ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్. లోక్‌సభ ఎన్నికల్లో 33శాతం టికెట్లను మహిళలకే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
నవీన్ తండ్రి బిజూ పట్నాయక్... దేశంలోనే మొదటిసారిగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో 33 శాతం రిజర్వేషన్లను అమలు చేశారు. దీనిని నవీన్ పట్నాయక్ 50 శాతానికి పెంచారు.
బంగాల్లో 41 శాతం మహిళలకే....
బంగాల్ ముఖ్యమంత్రి, అక్కడి అధికార పార్టీ సారథి ఓ మహిళ. అందుకే ఆమె మరో అడుగు ముందుకేశారు. లోక్‌సభ ఎన్నికల్లో 41శాతం టికెట్లను మహిళలకే కేటాయించారు. బంగాల్లోని 42స్థానాలకుగాను 17 చోట్ల మహిళలనే పోటీకి దింపారు మమతా బెనర్జీ. 2014లోనూ టీఎమ్సీ 35 శాతం సీట్లను మహిళలకే కేటాయించింది.