దేశంలో 'పరిశుభ్ర నగరం'గా పురస్కారాలు అందుకుంటున్న ఇండోర్ నగరంలో నిరాశ్రయులైన వృద్ధుల పట్ల మున్సిపల్ సిబ్బంది అమానవీయంగా వ్యవహరించారు. నగరంలో నిలువ నీడ లేక అల్లాడుతున్న అభాగ్యులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి జాతీయ రహదారి పక్కన శివార్లలో వదిలేశారు. దీంతో వారంతా చలికి వణుకుతూ బిక్కుబిక్కుమంటూ గడిపారు.
గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయం మేరకు మున్సిపల్ కార్మికుల బృందం ఇలా వృద్ధులను బలవంతంగా తరలించింది. అయితే సమీపంలోని క్షిప్రా గ్రామ ప్రజలు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల మున్సిపల్ సిబ్బంది వృద్ధులను తిరిగి వెనక్కి తెచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలో ఓ వృద్ధురాలిని వాహనంలోకి నెడుతున్న దృశ్యం చూపరులను కలచివేస్తోంది.
వీరి వివరణ ఇంకోలా..
ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ అభయ్ రాజన్గోవంకర్ ఇచ్చిన వివరణ వేరేలా ఉంది. తాము నిరాశ్రయులైన వారిని రాత్రి వేళ ఆశ్రయం కల్పించేందుకు తీసుకొస్తున్నట్లు ఆయన చెప్పారు. వారిని నగరం బయట వదిలేసినట్లు వచ్చిన ఆరోపణలను ఖండించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికార భాజపాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. విమర్శలు వెల్లువెత్తడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వీడియోలో కనిపిస్తున్న మున్సిపల్ సిబ్బందిపై చర్యలకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు.
ఇదీ చదవండి : 'రైతు ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు సహకరిస్తాం'