ఓ పోలీసు అధికారి అత్యుత్సాహం అతని ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. పెళ్లి కుదిరిన ఆనందంలో ప్రేయసితో కలిసి ఆయన చేసిన ఓ 'ప్రీ వెడ్డింగ్ షూట్' వివాదాస్పదమైంది. ఫలితంగా ఆయనకు పైఅధికారుల నుంచి అక్షింతలు పడుతున్నాయి. ఈ కథేంటో మీరే చూడండి.
రాజస్థాన్ ఉదయ్‌పుర్‌లోని కొత్రా పోలీస్‌స్టేషన్‌లో ధన్పత్సింగ్.. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయనకు ఇటీవలే ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఆ ఆనందంలో తన ప్రేయసితో కలిసి ఓ ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. ఆ సమయంలో ధన్పత్.. పోలీసు యూనిఫాంలోనే ఉన్నారు.
ఇంతకీ వీడియోలో ఏ ముందంటే..
ధన్పత్సింగ్ పోలీసు విధుల్లో ఉంటారు. ఇంతలో ఓ అమ్మాయి శిరస్త్రాణం ధరించకుండా వాహనం నడుపుతూ పట్టుబడుతుంది. ఇన్స్పెక్టర్ నుంచి తప్పించుకోవడానికి ఆమె కొంత డబ్బు ఆయన జేబులో ఉంచుతుంది. ధన్పత్ ఆ డబ్బును ఆనందంగా తీసుకుంటారు.
ఇదే ధన్పత్ సింగ్ కొంపముంచింది. మూడు నెలల క్రితం చిత్రీకరించిన ఈ వీడియో.. ప్రస్తుతం వివాదాస్పదమై సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పోలీస్ అయ్యుండీ లంచం తీసుకోవడమేంటని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇది పోలీసు శాఖకే తలనొప్పిగా తయారైంది.
క్రమశిక్షణ చర్యలు తప్పవా?
"ధన్పత్ సింగ్ వీడియో వ్యవహారం నా దృష్టికి వచ్చింది. పోలీసుశాఖకు తలవంపులు తీసుకొచ్చేలా మరే పోలీసు అధికారి కూడా యూనిఫాంలో వీడియోలు చిత్రీకరించకూడదని నిర్ణయించాం. ఈ మేరకు అందరు ఐజీపీలకు ఆదేశాలు జారీ చేశాం."- హవాసింగ్ ఘుమారియా, ఇన్స్పెక్టర్ జనరల్
వివాదాస్పద వీడియోను పరిశీలించి.. క్రమశిక్షణ చర్యలు తీసుకునే ముందు ధన్పత్ వివరణ తీసుకుంటామని ఉదయ్‌పుర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కైలాష్ చంద్ర బిష్ణోయ్ తెలిపారు.
'క్షమించండి... తప్పైపోయింది..'
వీడియోను ఉద్దేశపూర్వకంగా చిత్రీకరించలేదని సబ్ ఇన్స్పెక్టర్ ధన్పత్ తెలిపారు. అసలు ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్టు తనకు తెలియదన్నారు.
వీడియో చిత్రీకరిస్తున్న సమయంలోనే యూనిఫాం ధరించిన సన్నివేశాలను తొలగించాలని వీడియో గ్రాఫర్‌ను కోరినట్టు స్పష్టం చేశారు. అయితే వీడియో గ్రాఫర్ మొత్తం వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: వాట్సాప్ సందేశంతో జడ్జి బదిలీ... తీర్పు వాయిదా