హక్కుల కోసం మాట్లాడే విమర్శకులు.. కేంద్రం చేపట్టిన కీలక నిర్ణయాలను మాత్రం తప్పు పడుతుంటారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మూస విధానాలను పక్కనపెట్టి సరైన పనులు చేస్తున్నవారంటే అలాంటి వారికి ద్వేషమన్నారు. శుక్రవారం దిల్లీలో జరిగిన 'ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్'లో ప్రధాని ప్రసంగించారు.
370 అధికరణ రద్దు, పౌరసత్వ చట్ట సవరణ వంటి నిర్ణయాలను విమర్శిస్తున్నవారిపై ప్రధాని విరుచుకుపడ్డారు.
"ప్రపంచవ్యాప్తంగా వలసదారుల హక్కుల గురించి మాట్లాడే వాళ్లే.. మన పొరుగు దేశాల్లో మతపరమైన పీడన ఎదుర్కొంటున్న మైనారిటీలకు ఇక్కడ పౌరసత్వం కల్పిస్తామంటే వ్యతిరేకిస్తున్నారు. ఒకపక్క రాజ్యాంగ పరిరక్షణ కోసం వీరు మాట్లాడుతుంటారు. మరోపక్క జమ్ముకశ్మీర్ విషయంలో 370 అధికరణ రద్దును వ్యతిరేకిస్తారు.
న్యాయం కోసం గళం విప్పేవారే దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు తమకు అనుకూలంగా లేకపోయేసరికి అదే కోర్టు ఉద్దేశాలను ప్రశ్నించడానికి వెనుకాడడం లేదు." - నరేంద్ర మోదీ, ప్రధాని
మంచి పనులు చేస్తున్న వారిపై వీరికి ద్వేషం ఉందని.. అందుకే మార్పులను అవాంతరాలుగా చూస్తారని మోదీ విమర్శించారు.
జాతి నిర్మాణం అంటే కేవలం అభివృద్ధి, సుపరిపాలనలు కాదని మంచి పనులు చేయాలన్న దృఢ సంకల్పమని మోదీ స్పష్టం చేశారు. సుస్థిర అభివృద్ధికి మన దేశం ఒక నమూనాగా నిలుస్తుందని మోదీ చెప్పారు.
- ఇదీ చూడండి: 'కరోనాపై ముఖ్యమంత్రులకు సోనియా లేఖ'