కేరళలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17మంది కరోనా అనుమానితులకు నోరూరించే రుచికరమైన భోజనం పెడుతున్నట్లు వైద్యాధికారి డా.గణేశ్ మోహన్ తెలిపారు. భోజనంతో పాటుగా పుస్తకాలూ అందిస్తున్నట్లు చెప్పారు.
వైరస్ బాధితుల్లో 15మంది భారతీయులు ఉండగా.. ఇద్దరు బ్రిటన్వాసులు ఉన్నారు. వారికి తగిన విధంగా.. సమయానుకూలంగా భోజనం, పుస్తకాల సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
భారతీయుల మెనూ!
భారతీయులకు ఉదయం అల్పాహారంలో భాగంగా ఉదయం ఏడున్నర గంటలకు దోశ, సాంబారు, రెండు గుడ్లు, రెండు నారింజ పండ్లు, టీ, ఒక లీటర్ మినరల్ వాటర్ అందిస్తారు.
10.30 గంటలకు పండ్ల రసం ఇస్తారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా రెండు చపాతీలు, అన్నం, చేపల వేపుడు, పెరుగు వడ్డిస్తారు. సాయంత్రం పూట 3.30కు టీ, బిస్కెట్లు, అరటి పండ్లు, వడ ఇస్తారు. రాత్రి భోజనంలో అప్పం, రెండు అరటిపండ్లు ఒక లీటర్ మినరల్ వాటర్ అందిస్తారు.
బ్రిటన్‌వాసులకు ప్రత్యేకంగా..
ఆంగ్లేయుల కోసం ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు. కాల్చిన రొట్టె, ఉల్లిపాయలు లేకుండా ఆమ్లెట్, సూప్, పండ్ల రసాలు అల్పాహారంలో పెడతారు. భోజనానికి ముందు పైనాపిల్ జూస్, మళ్లీ సాయంత్రం వేళ పండ్ల రసాలు ఇస్తారు. రాత్రికి రొట్టె, ఉడకబెట్టిన గుడ్లు, పండ్లు అందిస్తున్నారు.
వైద్య విద్యార్థుల వసతి గృహంలోనే.. బాధితులకు కావాల్సిన భోజనం తయారు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు.
ఇదీ చూడండి: కరోనాను లెక్కచేయకుండా రోడ్డెక్కిన 'షాహీన్‌బాగ్' నిరసనకారులు