పార్లమెంటు ఇటీవల ఆమోదించిన కొత్త వ్యవసాయ బిల్లులు వ్యాపారులు, రైతుల మధ్య దూరాన్ని తగ్గిస్తాయని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో పలు విషయాలు వెల్లడించారు తోమర్.
కొత్త చట్టంతో వ్యాపారులు, రైతుల మధ్య అవగాహన పెరుగుతుందని తోమర్ అభిప్రాయపడ్డారు. పంటను కొనేందుకు వ్యాపారులే గ్రామాలను సందర్శిస్తారని, రైతులతో సంప్రదించిన ధరను నిర్ణయిస్తారని తెలిపారు. వాళ్లే లారీల్లో పంటను తీసుకెళతారని స్పష్టం చేశారు. దీనివల్ల రైతులకు ఖర్చులు కూడా కలిసివస్తాయని పేర్కొన్నారు.
"చిన్న, సన్నకారు రైతులు తమ ఉత్పత్తులను మండీకి తీసుకెళ్లేందుకు ఖర్చుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలా తీసుకెళ్లినా అప్పుడప్పుడు వారికి కనీస మద్దతు ధర లభించదు. ఇప్పుడు వారికి ఇళ్లు, పొలాల నుంచే అమ్ముకునేందుకు వీలు కల్పిస్తున్నాం."
- నరేంద్రసింగ్ తోమర్
- ఇన్నాళ్లు వ్యవసాయ మార్కెట్లలో వేలంలో ధరను నిర్ణయించేవారు. ఆ ధరకే రైతులు తమ పంటలను విక్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు రైతులు ఎక్కడైనా, ఎప్పుడైనా ఇష్టానుసారం తమ పంటను అమ్ముకునే వీలుంటుంది. ఈ అమ్మకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కూడా ఉండవు.
- వ్యవసాయ మార్కెట్లు.. రాష్ట్ర చట్టాలకు లోబడి ఉంటాయి. మా చట్టం ప్రకారం మార్కెట్లకు వెలుపల ఎలాంటి పన్నులు ఉండవు. రైతులు తమకు అనుకూలమైనదాన్ని ఎంచుకోవచ్చు. మేం ప్రతిపాదించిన చట్టాలు వ్యవసాయ మార్కెట్ల సంకెళ్ల నుంచి రైతులను విముక్తుల్ని చేస్తాయి.
- పంట ప్రారంభంలోనే చిన్న, సన్నాకారు రైతులకు వారి ఉత్పత్తులకు భరోసా లభిస్తుంది. ఇప్పుడు వారు ఖరీదైన పంటలు కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వ్యవసాయ బిల్లులు రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తాయి.
ఇదీ చూడండి: ఆ బిల్లులను తిప్పి పంపాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి