దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో విద్యుత్ సరఫరా తిరిగి ప్రారంభమైంది. కొన్ని గంటల అంతరాయం అనంతరం అనేక చోట్ల విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థ టాటా పవర్‌కు చెందిన గ్రిడ్‌లో లోపం తలెత్తడంతో ఈ సమస్య వచ్చినట్లు బృహన్ ముంబయి విద్యుత్ సరఫరా సంస్థ ప్రాథమికంగా వెల్లడించింది.
ఈ ఘటనను సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా పరిగణించారు. వెంటనే విచారణకు ఆదేశించారు. టాటా పవర్ విద్యుత్ గ్రిడ్‌లో తలెత్తిన లోపం కారణంగా ముంబయి, ఠాణే సహా మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా ఈ ఉదయం నిలిచిపోయింది.
పలు సేవలకు అంతరాయం..
ఫలితంగా ఆర్థిక రాజధానిలో అనేక ప్రాంతాల్లో దైనందిన కార్యకలాపాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడడంతో పలువురు రైల్వే ట్రాక్‌ల వెంట నడిచి వెళ్లారు. ఆస్పత్రుల్లో రోగులకు ఇబ్బంది లేకుండా జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్-బీఎంసీ సూచించింది.
విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చాక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత సబర్బన్ రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చినట్లు పశ్చిమ రైల్వే ట్వీట్ చేసింది.
ఇదీ చూడండి: ఆ వార్తా ఛానళ్లపై కోర్టుకెక్కిన బాలీవుడ్ నిర్మాతలు