రిజర్వేషన్లు ఉండాల్సిందేనని రాష్ట్రీయ స్యయం సేవక్ సంఘ్ అభిప్రాయపడింది. సమాజంలో ఆర్థిక, సామాజిక అంతరాయాలు కొనసాగుతున్నాయనీ, లబ్ధిదారులకు అవసరమైనంత వరకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని సూచించింది. రాజస్థాన్ పుష్కర్లో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ సమన్వయ కమిటీ సమావేశాల ముగింపు రోజు ఈ మేరకు ప్రకటన చేశారు సంఘ్ సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే.
"సమాజంలో సామాజిక, ఆర్థిక అంతరాలు కొనసాగుతున్నాయి. ఫలితంగా లబ్ధిదారులకు అవసరమైనంత వరకు రిజర్వేషన్లు కొనసాగించాలి. రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లకు మేం మద్దతిస్తున్నాం. ఆలయాలు, వైకుంఠధామాలు, జలాశయాల్లోకి ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ ప్రవేశం ఉండాలని సంస్థ కోరుకుంటోంది."
-దత్తాత్రేయ హోసబలే, ఆరెస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి
ఎన్ఆర్సీలో మార్పులు జరగాల్సిందే..
అసోం ఎన్ఆర్సీ తుది జాబితాలో కొన్ని తప్పులు ఉన్నాయని, వాటిని సరిచేశాకే తదుపరి చర్యలు చేపట్టాలని హొసబలే కేంద్రాన్ని కోరారు. ఓటరు జాబితాలో పేర్లున్న బంగ్లా అక్రమ వలసదారులను ఏరివేసేందుకు ఉద్దేశించిన ఎన్ఆర్సీ చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొన్నారు.
"అసోంలో 35 నుంచి 40 లక్షల మంది బంగ్లాదేశీ వలసదారులు ఉన్నారు. వాళ్లకు గత ప్రభుత్వాలు ధ్రువపత్రాలు అందించాయి. ఫలితంగా ఎన్ఆర్సీ ప్రక్రియ చాలా సంక్లిష్టంగా మారిపోయింది. ఎన్ఆర్సీ తుదిజాబితా అనేది చట్టం కాదు. అందులో తప్పులను సవరించాల్సి ఉంది."
- దత్తాత్రేయ హోసబలే, ఆరెస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి
ఇదీ చూడండి: '2030 నాటికి 2 కోట్ల 60 లక్షల హెక్టార్లకు పునరుజ్జీవం'