పార్లమెంట్ ప్యానెల్ సమావేశాలకు సంబంధించి ఎలాంటి విశ్వసనీయ సమాచారాన్ని వార్తా సంస్థలకు బహిర్గతం చేయవద్దని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులకు సూచించారు. కమిటీ కార్యకలాపాలు, బిల్లులకు సంబంధించిన సమాచారాన్ని వార్తా సంస్థలు తమ కథనాల్లో ప్రస్తావిస్తున్నాయని.. ఇలాంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్యానెల్ అధ్యక్షులకు లేఖ రాశారు.
"కమిటీ సమావేశాల్లో చర్చించే విషయాలు రహస్యంగా ఉండాలి. కమిటీ కార్యకలాపాల గురించి తెలిసిన ఎవరైనా ఆ సమాచారాన్ని మీడియాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా చేరవేయడానికి అనుమతి లేదు. నివేదికను సమర్పించే ముందు ఈ సమాచారాన్ని బయటకు చేరవేయడం సభా హక్కులను ఉల్లంఘించడంతో సమానం."
-వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్
ప్రస్తుతం ఉన్న నిబంధనలను అనుసరించి గోప్యతను పాటించాలని సభ్యులను కోరారు వెంకయ్య. సభలో నివేదికలు సమర్పించే వరకు మీడియాకు ఎలాంటి సమాచారం వెల్లడించకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే లేఖ రాసిన ఓంబిర్లా
లోక్సభ స్వీకర్ ఓంబిర్లా సైతం ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటులో నివేదిక ప్రవేశపెట్టక ముందు ఏ విషయం బయటకు రాకుండా చూడాలని కోరుతూ కమిటీల ఛైర్మన్లకు ఇదివరకే లేఖ రాశారు.
ఇదీ చదవండి- 'పార్లమెంటరీ కమిటీల నివేదికలు లీకైతే ఎలా?'