పౌరసత్వ చట్టం.... జాతీయ రాజకీయాల్లో కొద్దిరోజులుగా చర్చనీయాంశం. జాతీయ పౌర పట్టిక-ఎన్ఆర్సీపై కొన్ని రాష్ట్రాల్లో చర్చ జరుగుతుండగానే గతేడాది డిసెంబర్ 11న పౌరసత్వ చట్ట సవరణ బిల్లు-సీఏబీకి పార్లమెంటు ఆమోదం పొందింది మోదీ సర్కార్.
ఈ చట్టం ద్వారా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి 2014 డిసెంబర్ 31కు ముందు వచ్చిన మతపరమైన మైనారిటీలకు పౌరసత్వం కల్పిస్తారు. ప్రభుత్వం పేర్కొన్న మైనారిటీల్లో హిందు, సిక్కు, బౌద్ధ, జైన్, పార్శీ, క్రైస్తవులను మాత్రమే ఉన్నారు. ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వ ప్రక్రియను సరళీకృతం చేసిన ఈ చట్టం.. ముస్లిం వలసలకు సంబంధించి మౌనంగా ఉండిపోయింది.
కొన్ని వర్గాల భయాందోళనలతో..
ముస్లిమేతరుల గురించి ప్రస్తావించటం వల్ల.. ఈ చట్టాన్ని మతప్రాతిపదికన రూపొందించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. పలు వర్గాల ప్రజల్లో అసంతృప్తి చెలరేగింది. ఫలితంగా దేశవ్యాప్తంగా చాలా మంది సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు.
ముస్లింలకు చోటు లేని కారణంగా సీఏఏ రాజ్యాంగబద్ధతను పలువురు ప్రశ్నించారు. అధికార పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా చట్టాన్ని రూపొందించారని ఆరోపణలు ఉన్నాయి. సీఏఏకు తోడు జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)తో క్రమంగా ముస్లింలకు పౌరసత్వాన్ని తొలగిస్తారన్న భయాందోళనలు దేశంలో చెలరేగిన నిరసన జ్వాలలకు ప్రధాన కారణం.
ఫలించని ప్రభుత్వ ప్రకటన
భారత పౌరులకు సీఏఏతో ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టతనిస్తూ ప్రభుత్వం చేసిన ప్రకటన.. ఉద్రిక్తతలను తగ్గించటంలో విఫలమైంది. బిల్లు ఆమోదం పొందిన నెలరోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా వివిధ రూపాలు, తీవ్రతలతో ఆందోళనలు మిన్నంటాయి. అసోం నుంచి దిల్లీ వరకు.. విద్యార్థుల నుంచి పలు సామాజిక వర్గాల వరకు నిరసనల్లో పాల్గొన్నారు.
ప్రత్యేకంగా నిలిచిన షహీన్ బాగ్
వీటిన్నంటిని మించి దిల్లీ షహీన్ బాగ్‌లో మహిళల అకుంఠిత దీక్ష అందరి దృష్టిని ఆకర్షించింది. సత్యాగ్రహానికి నూతన అర్థం చెబుతూ సరికొత్త నిరసన రూపానికి షహీన్ బాగ్ వేదికైంది. సీఏఏ వ్యతిరేక ఉద్యమానికి ప్రధాన కేంద్రమైంది. నెల రోజులకు పైగా జరుగుతున్న ఈ ఆందోళనలో ఎక్కువగా మహిళలే పాల్గొనడం విశేషం. మహిళల దీక్షకు చాలామంది ప్రముఖ నేతలు సలాం కొట్టారు. శశి థరూర్ వంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఆమ్ఆద్మీ పార్టీ నేతలు, విద్యార్థి సంఘాలు వారికి బాసటగా నిలిచారు.
షహీన్ బాగ్‌లో ఆందోళనలను శాంతింపజేయాలని పోలీసులు ఎంత ప్రయత్నించినా వీలుపడలేదు. అక్కడ నుంచి వెళ్లేందుకు మహిళలు ఎంతమాత్రం ఒప్పుకోలేదు. ప్రతిపక్షాలు వీరికి మద్దతుగా నిలవటాన్ని విమర్శనాస్త్రంగా మలుచుకుంది అధికార భాజపా. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను సంఘటితం చేశారని ఆరోపించింది. నిరసనకారులను 'పెయిడ్ ఆర్టిస్టు'లుగా అభివర్ణించింది.
ప్రణాళికాబద్ధమా..? స్వచ్ఛందమా..?
షహీన్‌బాగ్ నిరసనల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నామని ఆందోళనకారులు స్పష్టం చేసినా.. నెలరోజుల పాటు నమ్మశక్యం కాని సమన్వయంతో మహిళలు ఉద్యమించటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిరసనల్లో మహిళలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారా లేక ప్రణాళికాబద్ధంగా ఎవరైనా ఈ ఆందోళన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించేందుకు కారణాలు తెలుసుకుంటే ఈ సందేహాలకు సమాధానాలు లభిస్తాయి.
సీఏఏకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించటానికి భావోద్వేగమే మొదటి కారణంగా చెప్పవచ్చు. నెలరోజులుగా పిల్లలతో కలిసి ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. ఎలాంటి హింసకు తావులేకుండా వ్యవహరించటం చాలా గొప్ప విషయం.
ప్రపంచంలో ఇప్పటివరకు మహిళలు ఉద్యమించిన ఘటనలు చాలానే ఉన్నాయి. అమెరికాలో సమాన హక్కుల కోసం 70వ దశకంలో మహిళలు ఉద్యమించారు. 2000లో తమ పిల్లల భద్రత కోసం తుపాకీ సంస్కృతిని నియంత్రించాలని వాషింగ్టన్లో మాతృమూర్తులు 'మిలియన్ మామ్ మార్చ్' నిర్వహించారు. భారత్‌లో చూస్తే.. మణిపురి మహిళలు చేపట్టిన నిరసనల ప్రభావం ఆ రాష్ట్రంతో పాటు సమాజాన్నీ కదిలించింది.
మహిళలు ముందుండి ఆందోళనలు చేపడితే భద్రతా బలగాలు నిలువరించలేవు. నిరసనకారులను చెదరగొట్టేందుకు బలవంతపు చర్యలకు దిగటం దాదాపు కష్టతరమైన పని.
రాజకీయ ప్రయత్నమా..?
షహీన్ బాగ్ ఉద్యమం... అధికార భాజపాకు వ్యతిరేకంగా భారీ రాజకీయ ప్రయత్నమై ఉండవచ్చన్నది మరో విశ్లేషణ. ముస్లింలు, భాజపా సైద్ధాంతికంగా పరస్పరం వ్యతిరేకించుకుంటారని చాలా మంది విశ్వసిస్తారు.
అయితే గెలుపోటముల రాజకీయాల్లో ముస్లింల మద్దతు భాజపాకు తప్పనిసరి. 2019లో వివాదాస్పద ముమ్మారు తలాక్ చట్టాన్ని తీసుకొచ్చి ముస్లిం మహిళలకు భాజపా దగ్గరైందని చెప్పవచ్చు. ఈ చట్టంతో ముస్లిం మహిళల అనుకూల ప్రభుత్వంగా భాజపా ముద్రవేయించుకుంది.
ఈ పరిస్థితుల్లో షహీన్ బాగ్‌లో ముస్లిం మహిళలను ముందుంచి నడిపిస్తే భాజపా ముద్రను చెరివేయవచ్చని ప్రతిపక్షాలు భావించి ఉంటాయి. తలాక్ చట్టంతో వచ్చిన ఆదరణను పౌరచట్టంతో దూరం చేయాలని ప్రయత్నించి ఉంటారని పలువురి విశ్లేషణ.
మద్దతుగా మరిన్ని చోట్ల..
షహీన్ బాగ్ నిరసనలకు సంఘీభావం తెలుపుతూ ప్రయాగ్‌రాజ్ వంటి చోట్ల మహిళల నేతృత్వంలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ నిరసనలు స్వచ్ఛందంగా చేసినవి అనేకన్నా ప్రణాళికాబద్ధంగా జరిగాయని చెప్పవచ్చు.
ఏది ఏమైనా.. మహిళలు భారీ ఎత్తున పాల్గొని చట్ట సభ్యులకు, సమాజానికి స్పష్టమైన సందేశమిచ్చారు. వారి జీవితంలో క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు మహిళలు ఎంత కీలకంగా వ్యవహరిస్తారో ఈ ఘటన ద్వారా తెలుసుకోవచ్చు.
(రచయిత-అన్షుమాన్ బెహెరా, అసోసియేట్ ప్రొఫెసర్, ఎన్ఐఏఎస్ బెంగళూరు)
ఇదీ చూడండి: 'అధికార పక్షం ప్రయోజనాల కోసమే ఆ నివేదికలు!'