ఏదైనా శుభకార్యం చేసేముందు రోజు, ముహూర్తం చూడటం భారతీయ సంస్కృతిలో ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. వాటికి మరింత విలువనిచ్చే నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కార్‌కు ఆగస్టు 5 చాలా ముఖ్యమైన రోజు. ఇదే తారీఖున పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మోదీ ప్రభుత్వం. అవేంటంటే..?
రామ మందిరం భూమిపూజ..
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ ఆగస్టు 5నే. దాదాపు 500 ఏళ్లుగా ఉన్న ఈ భూవివాదం ఇక ముగిసిపోనుంది. ఎన్నో ఏళ్ల నాటి గొడవలు గతేడాది సుప్రీం తీర్పుతో సద్దుమణిగాయి. ఫలితంగా రామ మందిరం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ పడింది. ఇప్పుడు ఇదే ప్రాంతంలో మోదీ శంకుస్థాపన చేయనున్నారు. తమకు బాగా కలిసొచ్చిన ఆగస్టు 5వ తేదీనే కాషాయదళం ఈ మహత్కార్యానికి పూనుకొంటోంది.
ఆర్టికల్ 370 రద్దు...
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి అధికారం ఇచ్చిన ఆర్టికల్ 370ని ఇదే రోజున రద్దు చేశారు. గతేడాది ఈ నిర్ణయం తీసుకున్నారు. జమ్ము కశ్మీర్, లద్ధాఖ్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది మోదీ సర్కార్. ఈ నిర్ణయంతో ఒకటే దేశం-ఒకటే రాజ్యంగం అమలు చేయాలన్న భాజపా ఆకాంక్ష నెరవేరింది.
మొగల్సరాయ్ స్టేషన్ పేరు మార్పు...
ఉత్తరప్రదేశ్ చందౌలీ జిల్లాలోని మొగల్సరాయ్ రైల్వే స్టేషన్ పేరు మార్చింది ఆగస్టు 5నే. ఇది ఆసియాలోని అతిపెద్ద రైల్వేయార్డుగా పేరు తెచ్చుకుంది. దాన్ని 2018లో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ రైల్వేస్టేషన్‌గా మార్పు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం ఏర్పడ్డాక నూతన పేరును ప్రతిపాదించగా.. కేంద్రం ఆమోదించింది.
ప్రపంచవ్యాప్తంగా ఇదే రోజున...
- ఆగస్టు 5, 1945: జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా అణుబాంబు వేసింది.
- ఆగస్టు 5, 1890: చంద్రుడిపై మొట్టమొదటిసారి అడుగుపెట్టిన నీల్ఆర్మ్స్ట్రాంగ్ పుట్టిన రోజు.
- ఆగస్టు 5, 2011: మార్స్‌పై నీరు ఉందని నాసా శాస్త్రవేత్తలు ప్రకటన చేసింది ఈరోజే.
- ఆగస్టు 5, 2011: బృహస్పతిని అధ్యయనం చేయడానికి నాసా అంతరిక్ష నౌకను పంపించింది.
ప్రపంచ రాజకీయం, పరిశోధనలు, ఆవిష్కరణల్లో కీలక ఘట్టాలకు ఆగస్టు 5 నాంది పలికింది. అలాంటి రోజునే భారత్ కూడా ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఇప్పుడు రామ మందిరానికి భూమిపూజ చేసేందుకు సిద్ధమైంది.