రామజన్మ భూమి అయోధ్యలో రామమందిరం నిర్మించాలని ఇటీవలే తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో అయోధ్యను అధునాతనంగా తీర్చిదిద్దేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు అధికారులు. రిసార్టులు, ఐదు నక్షత్రాల హోటళ్లు, అంతర్జాతీయ బస్ టర్మినల్, విమానాశ్రయాలను రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటు సరయూ నదిలో పడవ యాత్రలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం.
నాలుగేళ్లలో తిరుపతి తరహాలో
వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులతో ప్రతిరోజు అత్యంత రద్దీగా ఉండే తిరుపతి నగరంలా అయోధ్య రూపుదిద్దుకోవడానికి కనీసం నాలుగేళ్లు పుడుతుందని చెప్పారు యూపీ ప్రభుత్వ ఉన్నతాధికారి మురళీధర్ సింగ్. అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమై శరవేగంగా జరగనున్నట్లు తెలిపారు. శ్రీరామ నవమి నాటికి ఈ విమానాశ్రయంలో మొదటి విమానం ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ బస్ టర్మినల్తో పాటు ఆయోధ్య రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు సింగ్. ఫైజాబాద్, అయోధ్య మధ్య 5కి.మీ మేర పైవంతెన నిర్మించబోతున్నట్టు వివరించారు.
రిసార్టులు, ఫైవ్ స్టార్ హోటళ్లు
అయోధ్యలో ఒక ఐదు నక్షత్రాల హోటల్, 10 రిసార్టుల నిర్మాణ పనులు డిసెంబరులో ప్రారంభమవుతాయని తెలిపారు సింగ్.
దేశంలోనే అతిపెద్ద ఆలయం..
అయోధ్యలో నిర్మించబోయే రామమందిరం దేశంలోనే అతిపెద్దది కానుంది. 2వేల మంది శిల్పకాళాకారులు సగటున రోజుకు ఎనిమిది గంటలు శ్రమిస్తే రెండున్నర నెలల్లో ఆలయ నిర్మాణం పూర్తి అవుతుంది. ఇప్పటికే 65శాతం రాళ్లను చెక్కి సిద్ధం చేసినట్లు మురళీధర్ సింగ్ తెలిపారు.
77 ఎకరాల విస్తీర్ణంలో ఉండే అయోధ్య ఆలయ ప్రాంగణంలో గోశాల, ధర్మశాలతో వేదశాలలను నిర్మించనున్నారు. 10 శ్రీరామ ద్వారాలుంటాయి ఆధ్యాత్మిక నగరంగా ఆయోధ్యను తీర్చిదిద్దుతారు. దాదాపు 10వేల విశ్రాంత గదులను నిర్మించాలని భావిస్తున్నారు అధికారులు.
ఇదీ చూడండి: సుప్రీం 'అనర్హత' తీర్పుపై భాజపా, కాంగ్రెస్ 'హర్షం'