విమానయాన నియంత్రణ సంస్థలకు చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంటు మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ ఎయిర్క్రాఫ్ట్ సవరణ బిల్లు-2020 ద్వారా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కూ చట్టపరమైన హోదా లభిస్తుంది.
ఈ బిల్లుకు లోక్సభ మార్చిలోనే ఆమోదం తెలపగా.. ప్రస్తుత సమావేశాల్లో రాజ్యసభలో మూజువాణి ఓటు ద్వారా నెగ్గింది.
బిల్లులోని అంశాలు..
- డీజీసీఏ, పౌరవిమానయాన భద్రత సంస్థ (బీసీఏఎస్), విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (ఏఐఐబీ)కు చట్టబద్ధత కల్పించటం
- సాయుధ దళాలకు చెందిన విమానాలను ఎయిర్క్రాఫ్ట్ చట్టం పరిధి నుంచి తొలగించటం
- నిబంధనల ఉల్లంఘన జరిమానాలను రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు పెంచటం లేదా రెండేళ్లు జైలు
భాజపా X కాంగ్రెస్
ఎయిర్క్రాఫ్ట్ బిల్లుపై చర్చలో భాగంగా.. విమానాశ్రయాల ప్రైవేటీకరణపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణలో అవినీతిపై దర్యాప్తునకు డిమాండ్ చేసింది.
"అభివృద్ధి పేరుతో ప్రైవేటీకరణ కారణంగా విమానాశ్రయాల గుత్తాధిపత్యానికి దారితీస్తుంది. భవిష్యత్తులో భారత విమానాశ్రయాలన్నీ ఒకే సంస్థ చేతిలో ఉంటాయి. దీన్ని మీరు ఎలా అనుమతిస్తారు? ఒకే సంస్థ చేతికి ఎయిర్పోర్టులను అప్పగించటం నిబంధనలను తుంగలో తొక్కటమే. ఇది ప్రజాధనాన్ని కొల్లగొట్టటమే. ఇందులో కచ్చితంగా అవినీతి దాగుంది. ఈ విషయంలో దర్యాప్తు జరగాలి."
- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ ఆరోపణలను భాజపా సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు ఖండించారు. విమానాశ్రయాల అభివృద్ధిలో పారదర్శకతే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. పక్షపాత పెట్టుబడిదారీ విధానం కాంగ్రెస్ హయాంలో సాగిందని ఆరోపించారు. 2జీ, బొగ్గు కుంభకోణాల్లో ఇదే జరిగిందని ధ్వజమెత్తారు.
ఇదీ చూడండి: మరిన్ని విమానాశ్రయాల ప్రైవేటీకరణకు ప్రతిపాదనలు