దిల్లీ అల్లర్ల అంశంపై చర్చ చేపట్టాలని రాజ్యసభలో విపక్ష నేతలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. సభ వెల్‌లోకి ప్రవేశించి నిరసన చేపట్టారు. ఫలితంగా సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు. కొందరు కావాలనే సభ కార్యకలాపాలు అడ్డుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఈనెల 11న సభా కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అవుతాయని సభను వాయిదా వేశారు.
అంతకుముందు సభ ప్రారంభమయ్యాక ఈనెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజంలో వారి పాత్ర అన్ని రంగాల్లో కీలకమని కొనియాడారు వెంకయ్య. కొద్దిసేపటికే విపక్షాలు దిల్లీ అల్లర్లపై చేపట్టిన నిరసనలతో సభ దద్దరిల్లింది. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని సభ్యులను వెంకయ్య కోరినా ఫలితం లేకపోయింది.
లోక్‌సభలోనూ పట్టువిడవని విపక్షాలు
దిల్లీ అల్లర్ల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో లోక్‌సభలో చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో సభా కార్యకలాపాలు ఈనెల 11కు వాయిదాపడ్డాయి.