భారతదేశ చరిత్రలో తొలిసారి రాజ్యసభ పనిచేసిన సమయాన్ని నివేదిక రూపంలో వెల్లడించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవతో ఈ పనికి పూనుకొంది రాజ్యసభ సచివాలయం. ఆయన ఆదేశాల మేరకు శాసన, పర్యవేక్షణ, నిర్వహణ ఆధారంగా నివేదికను సిద్ధం చేశారు. ఆ లెక్కల ప్రకారం ఎగువ సభ ప్రతి ఏడాది సగటున 340 గంటలు పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజాశ్రేయస్సు కోరే అంశాలను సభలో పెట్టడం, సభ్యులు వాటిపై చర్చించడానికి రాజ్యసభ వేదికగా ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, సాధారణ బడ్జెట్ సమావేశాలు, చిన్నపాటి చర్చలు, శూన్య గంట, ప్రత్యేకమైన అంశాలపై చర్చ, ఆయా శాఖల పనితీరుపై చర్చ సమయంలో ఈ సభ పనిచేస్తుంది. 100 శాతం సమయాన్ని మూడు విధాలుగా విభజిస్తే...
>> 40.20 శాతం సమయం - ప్రజా సమస్యలపై చర్చించేందుకు
>> 32.22 శాతం సమయం - జవాబుదారీతనం కోసం
>> 27.57 శాతం - చట్టాలు తయారు చేసేందుకు ఉపయోగిస్తున్నారు.
1978 నుంచి ఉన్న డేటా ఆధారంగా... సభ ఎంత సమయం పనిచేసింది? ఏఏ పనులకు ఎంత సమయం కేటాయించారు? అనే దానిపై నివేదికను తయారు చేసింది రాజ్యసభ సచివాలయం. 1978-2018 మధ్య కాలంలో.. సభ మొత్తం సమయంలో 77 శాతం సద్వినియోగం అయింది. 23 శాతం వృథా అయింది.
1978-2018 కాలంలో రాజ్యసభ పనిచేసే మొత్తం సమయాన్ని ఎలా ఉపయోగించారో శాతాల్లో నివేదికలో స్పష్టం చేశారు.
సాధారణ బడ్జెట్ సమావేశాలు కోసం (7.08 శాతం), ధన్యవాద తీర్మానంపై (4.36 శాతం), వివిధ శాఖల పనితీరుపై చర్చించేందుకు (3.93 శాతం), శూన్య గంట, ప్రత్యేక ప్రస్తావనలకు (10 శాతం), ప్రశ్నావళి కోసం (14.19 శాతం), అటెన్షన్ నోటీసులను పిలిచేందుకు (7.11 శాతం), వివిధ సమస్యలపై మంత్రుల ప్రకటనలు (6.33 శాతం), ప్రైవేట్ సభ్యుల తీర్మానాలు (3.16 శాతం), అరగంట చర్చలకు (1.25 శాతం) సమయం కేటాయించినట్లు సర్వే స్పష్టం చేసింది.
చట్టాలు రూపకల్పనకు..
చట్టాలు రూపొందించేందుకు రాజ్యసభ 27.57 శాతం సమయం కేటాయిస్తోంది. ఇందులో 24.50 శాతం ప్రభుత్వ బిల్లులు ఆమోదానికి, 3.52 శాతం ప్రైవేటు సభ్యుల బిల్లుల కోసం కేటాయిస్తున్నారు.
గంటల్లో లెక్కేస్తే సభ మొత్తం సమయంలో... 3,429 గంటలు ప్రభుత్వ బిల్లులు ఆమోదానికి.. 489 గంటలు ప్రైవేటు సభ్యుల బిల్లుల కోసం ఉపయోగించారు.
2002లో 40.09 శాతం సమయం ప్రభుత్వం బిల్లుల కోసం ఉపయోగించుకోగా.. 2015లో అది కాస్తా 10.87 శాతం పెరిగింది. గతేడాది శీతాకాల సమావేశాల్లో... 250వ సెషన్లో రికార్డు స్థాయిలో 45.90 శాతం సమయం కేటాయించారు. 15 బిల్లులు ఆమోదించారు. మొత్తం 107.05 గంటల చారిత్రక సెషన్లో సభ 49.08 గంటలు పనిచేసింది.
అప్పట్లో కంటే తక్కువేనా..!
1978-2018 కాలంలో రాజ్యసభ 3,022 సార్లు సమావేశమైంది. ప్రతీ భేటీ సగటు సమయం ఆరు గంటలుగా ఉండగా.. మొత్తం పని గంటలు 18,132గా నమోదయ్యాయి. ఇందులో 13,946 గంటలు వినియోగించుకున్నారు. సభా సమయంలో 76.91 శాతం సద్వినియోగం కాగా.. పలు సార్లు రద్దు కావడం వల్ల 23.09 శాతం సమయం వృథా అయిందని తాజా లెక్కల్లో తేలింది.
1978-1988 కాలంలో ప్రతీ ఏటా రాజ్యసభ 500 గంటలు దాటే పనిచేసిందని తెలిపారు. అయితే 1995 నుంచి మాత్రం 6 సార్లు సభ 300 గంటలు పైగా పనిచేసింది. దాదాపు 23 ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
ఏప్రిల్ 20 నుంచి మళ్లీ రాజ్యసభ సెక్రటేరియట్ కార్యకలాపాలు పునః ప్రారంభం కాగా.. తొలి వారంలో ఈ నివేదికలు సిద్ధం చేశారు. ఇదే పద్ధతిని లోకసభ, పార్లమెంటు కూడా పాటించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయా విభాగాల అధికారులకు సూచించారు.