సాంక్రమిక వ్యాధుల సవరణ బిల్లు-2020కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. వైద్య సిబ్బంది భద్రత కోసం కేంద్రం తీసుకొచ్చిన అంటువ్యాధుల చట్టం సవరణ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గతంలో ఆమోదించారు. ఈ బిల్లును ఇవాళ ఎగువసభలో ప్రవేశపెట్టారు ఆరోగ్య మంత్రి డా.హర్షవర్ధన్. ఈ బిల్లు చట్టంగా మారితే వైద్యసిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలపై దాడులకు పాల్పడే వారికి గరిష్ఠంగా ఐదేళ్ల వరకు శిక్ష పడనుంది.
అయితే.. బిల్లుపై చర్చ సందర్భంగా అధికార పక్షాన్ని లక్ష్యంగా చేసుకొని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ చట్టం ద్వారా రాజ్యాంగ పరమైన పరిమితులు దాటి మరీ కేంద్రం రాష్ట్రాల వ్యవహరాల్లో కేంద్రం కలుగచేసుకోవాలని చూస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియిన్ ఆరోపించారు.
రాష్ట్రాలతో సంప్రదింపులేవీ?
ప్రపంచంలో 3 ప్రజాస్వామ్య దేశాల్లో మాత్రమే ఆర్డినెన్స్‌ల రాజ్యం నడుస్తోందని అవి పాకిస్థాన్, బంగ్లాదేశ్, భారత్ అని డెరెక్ అన్నారు. వైస్రాయ్‌ల శకం ముగిసినప్పటికీ భాజపా నాయకుల్లో ఆ వాసనలు మిగిలే ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రాల విషయాల్లో జోక్యం చేసుకునే ముందు కేంద్రం ఆ రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని తెరాస నేత కేశవరావు అన్నారు.
కరోనా వేళ ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీని నిలువరించడంలో కేంద్రం విఫలమైందని.. దాని ఫలితమే హైదరాబాద్‌లో ఓ ఆస్పత్రి దోపిడీకి కారణమైందని మండిపడ్డారు. దీన్ని అరికట్టేందుకు ఓ వ్యవస్థ ఉండాలన్నారు. సమాజ్‌వాదీ పార్టీ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వెల్లడించింది.
'సంక్షోభ సమయంలో విఫలం'
పేదలు, వలస కార్మికులను ఆదుకోవడంలోనూ కేంద్రం విఫలమైందని విపక్షాలు ధ్వజమెత్తాయి. వలస కార్మికులను ఆకలిచావులకు గురిచేసిన గుత్తేదార్లపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చెప్పాలని డీఎంకే డిమాండ్ చేసింది. సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండానే లాక్డౌన్ అమలు చేశారని ఆరోపించారు డీఎంకే ఎంపీ షణ్ముగం.