రాజస్థాన్ రాజకీయం రాజ్‌భవన్‌కు చేరింది. శాసనసభ సమావేశాల నిర్వహణకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ అధికారిక నివాసం ఆవరణలో ధర్నాకు దిగారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.
కాంగ్రెస్ క్యాంప్ నుంచి నాలుగు బస్సుల్లో రాజ్‌భవన్‌కు చేరుకున్న ఎమ్మెల్యేలు.. గవర్నర్‌తో ముఖ్యమంత్రి సమావేశం పూర్తయ్యేవరకు బయటే ఉన్నారు. అనంతరం ముఖ్యనేతల నిర్ణయం మేరకు ధర్నాకు దిగారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నినాదాలు చేశారు. తమ ఎమ్మెల్యేలు హరియాణా క్యాంప్‌లో పట్టుబడ్డారని పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు గహ్లోత్.
'ఒత్తిళ్ల వల్లే ఆదేశాలు ఇవ్వట్లేదు'
గవర్నర్‌తో సమావేశానికి ముందు.. సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు గహ్లోత్. శాసనసభ సమావేశాల నిర్వహణకు అనుమతించకూడదని రాష్ట్ర గవర్నర్ కల్రాజ్ మిశ్రాపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు.
న్యాయస్థానంలో పైలట్‌కు ఊరట
హైకోర్టులోనూ గహ్లోత్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు నేత పైలట్ వర్గం ఎమ్మెల్యేలకు న్యాయస్థానంలో ఊరట లభించింది. శాసనసభ్యులపై ఎలాంటి స్పీకర్ చర్యలు తీసుకోకుండా యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది కోర్టు.
కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో 19 మంది ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు పంపించారు స్పీకర్ సీపీ జోషి. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెబల్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు.. సభాపతి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
అయితే హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు స్పీకర్ జోషి. అక్కడా సానుకూల ఫలితం రాలేదు.
'భాజపా ఆతిథ్యం నిజం కాదు'
ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపిస్తున్నట్లుగా తమకు దిల్లీలో భాజపా ఆతిథ్యం ఇవ్వడం లేదని పేర్కొన్నారు పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు. వారి సొంత నిర్ణయానికి అనుగుణంగానే క్యాంప్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. తమ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన డిమాండ్లను సీఎం నెరవేర్చని కారణంగానే అసమ్మతి బాట పట్టినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ: మన్మోహన్