కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తనపై చేసిన విమర్శలకు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఘాటుగా స్పందించారు. భాజపా ప్రభుత్వ హయాంలోనే... కేంద్ర బ్యాంకు అధిపతిగా తన పదవి కాలంలో మూడింట రెండువంతులు పనిచేసినట్లు ఆయన గుర్తు చేశారు. అయితే ఈ అంశంపై రాజకీయ విమర్శలకు దిగబోనని ఆయన స్పష్టం చేశారు.
"నేను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం 8 నెలలు మాత్రమే ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్నాను. భాజపా హయాంలో 26 నెలలు సేవలందించాను. అంటే భాజపా హయాంలోనే నేను ఎక్కువ కాలం పనిచేశాను. 2013 సెప్టెంబర్ 5 నుంచి 2016 సెప్టెంబర్ వరకు ఆర్బీఐ గవర్నర్‌గా నేను ఉన్నాను. అప్పుడే బ్యాంకింగ్ రంగ ప్రక్షాళన చేపట్టాం. అయితే అది ఇంకా పూర్తికాలేదు. మీరు (భాజపా) బలమైన వృద్ధిని కోరుకుంటే ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన చేపట్టండి."
- రఘురామ్ రాజన్, ఆర్బీఐ మాజీ గవర్నర్
ఈ నెల ప్రారంభంలో నిర్మలా సీతారామన్ న్యూయార్క్‌లో మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వారి హయాంలోనే భారత బ్యాంకింగ్ రంగం అధోగతి పాలయిందని, అదో 'చెత్త దశ' అని పేర్కొన్నారు.
సంస్కరణలు కావాలి
దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి సరికొత్త సంస్కరణలు అవసరమని రాజన్ పేర్కొన్నారు. 5 శాతం జీడీపీ వృద్ధిరేటుతో భారత్ గణనీయమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: 'రాహుల్ విదేశీ పర్యటనల వెనుక మర్మం ఏంటో?'