జమ్మూ-కశ్మీర్‌లో చినాబ్ నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన వచ్చే ఏడాదికల్లా సిద్ధమవుతుందని అధికారులు ఆదివారం తెలిపారు. డిసెంబర్-2022లో ఈ వంతెనపై తొలి రైలు పరుగులు తీస్తుందని, ఫలితంగా కశ్మీర్ లోయకు దేశంలోని మిగిలిన ప్రాంతంతో తొలిసారిగా రైలు అనుసంధానం ఏర్పడుతుందని వివరించారు.
ఈ వంతెన స్పాన్ పొడవు 467 మీటర్లు, భూమి నుంచి (నది అడుగు భాగం నుంచి) చూస్తే 359 మీటర్ల ఎత్తు ఉంటుంది. దిల్లీలోని కుతుబ్ మీనార్ ఎత్తు 72 మీటర్లు, ఐఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లు.
చినాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ రైలు వంతెన ఈ రెండింటి కంటే ఎత్తైనది. 'ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తట్టుకుంటుంది' అని ఓ అధికారి చెప్పారు. ఏడాది కాలం నుంచి ఈ వంతెన పనులు వేగం పుంజుకున్నాయని, దిల్లీలోని ఉన్నతస్థాయి అధికారులు నేరుగా పర్యవేక్షిస్తున్నారని వివరించారు.
ఇదీ చూడండి: చంద్రయాన్-2లోని రోవర్ పనిచేస్తోందా?