పరువునష్టం కేసు విషయమై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ గుజరాత్‌లోని అహ్మదాబాద్ కోర్టులో హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను.. హత్య కేసు నిందితుడు అంటూ రాహుల్ ఆరోపించిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. అయితే తాను ఏ తప్పు చేయలేదని రాహుల్ కోర్టుకు వివరించారు.
రాహుల్ వివరణను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి రాహుల్‌కు మినహాయింపు కోరుతూ ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశమై విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది న్యాయస్థానం.
మరో కేసులోనూ..
నోట్ల రద్దుకు ముందు అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు (ఏడీసీ) కరెన్సీ మార్పిడి కుంభకోణానికి పాల్పడిందని రాహుల్ ఆరోపించారు. ఈ బ్యాంకు డైరెక్టర్లలో అమిత్‌షా ఒక సభ్యుడు కావడమే ఇందుకు కారణం. దీనిపై దాఖలైన పరువు నష్టం కేసులోనూ ఆయన నేడు కోర్టు ఎదుట హాజరయ్యారు.
హార్దిక్‌తో భోజనం
విచారణ అనంతరం హార్దిక్ పటేల్ సహా కాంగ్రెస్ నేతలతో నేతలతో కలిసి అగాషియే హోటల్లో మధ్యాహ్న భోజనం చేశారు రాహుల్. 2017లో ఈ హోటల్లోనే జపాన్ ప్రధాని షింజో అబే దంపతులకు ప్రధాని మోదీ ఆతిథ్యమిచ్చారు.
అనంతరం గుజరాత్‌లోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో చర్చలు జరిపారు.
ఇదీ చూడండి: ఇథియోపియా ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి