'చౌకీదార్ చోర్' వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు తప్పుగా ఆపాదించినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సర్వోన్నత న్యాయస్థానానికి బేషరతు క్షమాపణలు చెప్పారు. తాను ఈ వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా చేయలేదని పేర్కొంటూ నేడు మూడు పేజీల అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్ సహా రఫేల్ తీర్పు సమీక్షా వ్యాజ్యాలపై ఈనెల 10న విచారణ జరగనుంది.
"సుప్రీంకోర్టు అత్యున్నత సంస్థ. కోర్టుపై నాకు అపార గౌరవం ఉంది. న్యాయవ్యవస్థ విధానాల్లో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ జోక్యం చేసుకునే ఉద్దేశం నాకు లేదు. ఈ వ్యవహారంలో నాపై నమోదైన నేరపూరిత కోర్టు ధిక్కార కేసును కొట్టేయాలని అభ్యర్థిస్తున్నా."
- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందంపై గత ఏడాది ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఏప్రిల్ 10న ఉత్తర్వులిచ్చింది. ఈ తీర్పు 'చౌకీదార్ చోర్' అనే అంశాన్ని స్పష్టం చేస్తుందంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుపై రాహుల్ తప్పుగా వ్యాఖ్యానించారంటూ భాజపా నేత మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కోర్టు సైతం వ్యాఖ్యలను తప్పుగా ఆపాదించారని అభిప్రాయపడుతూ రాహుల్‌కు ఏప్రిల్ 23న నోటీసులు జారీ చేసింది. రెండు ప్రమాణపత్రాలు సమర్పించిన రాహుల్.... తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తంచేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.
సంతృప్తి చెందని సుప్రీం
రాహుల్ సమర్పించిన ప్రమాణపత్రాలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు. ఓసారి తప్పు చేశామని, మరోసారి చేయలేదని అంటున్నారని మందలించింది. అసలు మీరు ఏం చెప్పదలిచారో అర్థంకావడంలేదని అసహనం వ్యక్తంచేసింది. సుస్పష్ట వివరణ ఇచ్చేందుకు మరో అవకాశం ఇచ్చింది. అందుకే రాహుల్ నేడు మరో ప్రమాణపత్రం దాఖలు చేశారు.