కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళకు చేరుకున్నారు. సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రాహుల్ వెంట కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉన్నారు.
వయనాడ్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పునారావాస కేంద్రాలను ఈ పర్యటనలో రాహుల్ సందర్శిస్తారని తెలుస్తోంది.
"కొద్ది రోజులు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గంలోనే ఉండనున్నాను. వరదల కారణంగా వయనాడ్ ధ్వంసమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను సమీక్షిస్తాను."
-ట్విట్టర్లో రాహుల్ గాంధీ
వయనాడ్‌లో వరదముంపుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి పినరయి విజయన్, వయనాడ్ జిల్లా పాలనాధికారితో సంభాషించినట్లు రాహుల్ వెల్లడించారు.
రెండో పర్యటన
ఎన్నికల్లో గెలిచిన అనంతరం వయనాడ్‌లో రెండోసారి పర్యటిస్తున్నారు రాహుల్. ఇంతకుముందు తనను గెలిపించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా మూడు రోజులపాటు వయనాడ్‌లో పర్యటించారు.
ఇదీ చూడండి: కశ్మీర్‌పై మసూద్ ఆడియో టేప్ కలకలం