సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం నిర్వహించిన గణతంత్ర పరేడ్లో హింసాత్మక ఘటనలపై ఇప్పటివరకు 22 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. 300 మంది సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వారిలో ఇద్దరు ఐసీయూలో ఉన్నట్లు చెప్పారు. మంగళవారం జరిగిన హింసాత్మక ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
భద్రత కట్టుదిట్టం..
హింసాత్మక ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే.. ఈ అంశంపై విచారణ ప్రారంభించిన అధికారులు.. పంజాబ్, హరియాణా గ్యాంగ్‌స్టర్ల కదలికలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నాటి ఉద్రిక్తతల నేపథ్యంలో.. దిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. దేశ రాజధానిలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసుల గస్తీ పెంచగా పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపారు. చారిత్రక ఎర్రకోట ప్రాంగణంలో రైతుల చర్యల ఫలితంగా.. అక్కడ భారీగా పోలీసు బలగాలు మోహరించారు.
దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళనలు చేస్తున్న సింఘు, టిక్రీ ప్రాంతాల్లో భద్రత పెంచారు. ఎర్రకోట, లాల్ క్విలా, జామా మసీదు మెట్రో స్టేషన్ ప్రవేశ మార్గాలను మూసేశామని దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఘాజీపూర్ మార్కెట్ నుంచి దిల్లీకి వచ్చే రహదారి పూర్తిగా మూసివేశారు.
ఇదీ చదవండి:'ఎర్రకోటపై జెండా ఎగురవేసిన వారు మూల్యం చెల్లించాల్సిందే'