కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సింఘు సరిహద్దు వద్ద రైతులు చేస్తున్న నిరసనలు 27వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం ప్రారంభించిన రైతు సంఘాల నేతల రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ధర్నా ప్రాంతాల్లోనే నిరాహార దీక్షలు చేపట్టారు రైతులు.
దిల్లీలో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోయినప్పటికీ.. అన్నదాతలు తమ ఆందోళనను విరమించుకోలేదు. పట్టుదలతో నిరసనలు కొనసాగిస్తున్నారు. మంటను ఏర్పాటు చేసుకొని చలి కాచుకుంటున్నారు. సింఘుతో పాటు టిక్రి, గాజిపుర్ సరిహద్దుల వద్ద భైఠాయించారు.
మరోవైపు చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం రాసిన లేఖపై రైతు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం పంపిన లేఖలో కొత్త ప్రతిపాదనలేవి లేవని పేర్కొన్నాయి. సరైన పరిష్కార మార్గంతో వస్తే చర్చలకు సిద్ధమైనని ప్రకటించాయి. భవిష్యత్ కార్యాచరణపై రైతు సంఘాల మంగళవారం మరోసారి భేటీ కానున్నాయి.
నిరసనల్లో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. డిసెంబర్ 23న 'కిసాన్ దివస్'గా పాటించి రైతులకు మద్దతుగా ఒక్కపూట ఉపవాసం ఉండాలని ప్రజలను కోరాయి. 25 నుంచి 27 వరకు హరియణాలో టోల్ రుసుం వసూలు చేయకుండా నిరసన చేయాలని నిర్ణయించాయి.
ఇదీ చదవండి: కారులో మంటలు- ఐదుగురు సజీవ దహనం