తబ్లీగీ జమాత్ సభ్యులపై కేంద్ర మైనారిటీశాఖ మంత్రి ముఖ్తర్ అబ్బాస్ నఖ్వీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారి వల్లే దేశంలో కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. తబ్లీగీల నేరపూరిత నిర్లక్ష్యం వల్లే లాక్డౌన్ ఇన్ని రోజుల పాటు సాగుతోందని తెలిపారు. ఈటీవీ భారత్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నఖ్వీ ఈ వ్యాఖ్యలు చేశారు.
తబ్లీగీల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నఖ్వీ ఆరోపించారు. గ్రామాల్లో దాక్కుని.. కరోనా వైరస్ను వ్యాపింపజేశారని మండిపడ్డారు. భద్రతా సంస్థలు వారి నిర్లక్షాన్ని దృష్టిలో పెట్టుకుని.. తగిన శిక్ష పడేలా చూస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తొలినాళ్లలోనే ప్రకటించినప్పటికీ.. తబ్లీగీలు బయటకు రాలేదని గుర్తు చేశారు నఖ్వీ. వారు చేసిన అతిపెద్ద తప్పు ఇదేనని అభిప్రాయపడ్డారు.
వారి ఆటలు సాగవ్!
ఇస్లామోఫోబియా(ఇస్లాం పట్ల భయం) పేరిట కొందరు 'కుహానా మేధావులు' భారత దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు నఖ్వీ. అలాంటి వారు యత్నాలు ఫలించవని, భారత దేశ లౌకికతత్వం ఎలాంటిదో యావత్ ప్రపంచానికి తెలుసని ఉద్ఘాటించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 'కుహానా మేధావుల'ను నిఘా, భద్రతా సంస్థలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయని, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కేంద్ర మంత్రి.
భయం వీడండి
లాక్డౌన్ను దశల వారీగా ఎత్తివేస్తున్నామని.. ప్రజలు భయపడకుండా తమ రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనాలని సూచించారు నఖ్వీ.