సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణ అత్యంత కీలక దశకు చేరుకుంది. వారం రోజుల దసరా సెలవుల విరామం అనంతరం నేడు (38వ రోజు) ఈ కేసుపై అత్యున్నత న్యాయస్థానం తిరిగి విచారణ ప్రారంభించనుంది.
మధ్యవర్తిత్వం విఫలమైన అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఆగస్టు 6 నుంచి అయోధ్య కేసుపై రోజువారీ విచారణ చేపడుతోంది. నిర్దేశించిన గడువుకు ఒక్క రోజు ముందు.. ఈ నెల 17న విచారణ ముగియనుంది. నేటితో ముస్లిం వర్గాల వాదనలు పూర్తవుతాయి. అనంతరం 16న హిందూ వర్గాల వాదనలు ముగుస్తాయి.
సున్నితమైన రామజన్మ భూమి- బాబ్రీ మసీదు భూ వివాదం విచారణ ముగుస్తుండటం- ఏ సమయంలోనైనా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఆదివారం అయోధ్యలో 144 సెక్షన్ విధించారు అధికారులు. డిసెంబర్ 10 వరకు ఆంక్షలు కొనసాగుతాయని జిల్లా మెజిస్ట్రేట్ అనూజ్ కుమార్ స్పష్టం చేశారు. రానున్న పండగలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
ఇదీ చూడండి:- 75 ఏళ్ల వయసులో 'అమ్మ' అయిన 'బామ్మ'